బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి రోజు భారత్ 109 పరుగులకే ఆలౌట్ కాగా.. 156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకే చాపచుట్టేసింది. 88 పరుగుల వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే గిల్ (5), రోహిత్ శర్మ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 18 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసిన భారత్.. ఇంకా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 51 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (15), కోహ్లి (1) క్రీజ్‌లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్ సందర్భంగా టీవీల్లో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆట పట్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఉన్న కమిట్‌మెంట్‌ను సూచించాయి. తొలి ఓవర్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఎడమ చేతి చూపుడు వేలు నుంచి రక్తం కారుతున్నా, ప్యాంట్‌కు తుడుచుకుని బౌలింగ్‌ను కొనసాగించాడు. 2022 డిసెంబర్ నుంచి స్టార్క్‌ను ఈ గాయం వేధిస్తూనే ఉంది. నాటి నుంచి పలు మార్లు ఈ గాయం కారణంగా స్టార్క్ జట్టుకు దూరంగా ఉన్నాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి స్పిన్నర్లకు బంతిని అందించాడు.
స్టార్క్‌కు తగిలిన గాయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో హంగామా చేస్తున్నారు. రక్తం కారుతున్నా, ఏ మాత్రం వెరవకుండా బౌలింగ్ చేస్తున్నాడు.. ఆసీస్ ఆటగాళ్ల కమిట్‌మెంట్‌పై ఎప్పుడూ డౌట్ పడకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిగా కొందరు టీమిండియా హార్డ్ కోర్ అభిమానులు దవడ విరిగినప్పుడు అనిల్ కుంబ్లే బౌలింగ్ చేస్తున్న దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఆ పాటి రెండు రక్తం చుక్కలకే కమిట్‌మెంట్ అంటే, దీన్ని ఏమనాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ సంగతి పక్కకు పెట్టి అభిమానులు ఈ విషయంలో వాదనలకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment