బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 51/4గా ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 394 పరుగులు వెనుకపడి ఉంది. రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (33) క్రీజ్‌లో ఉన్నారు.
పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు కేవలం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇందులో మెజార్టీ ఓవర్లు ఆస్ట్రేలియానే ఎదుర్కొంది. భారత్ కేవలం 17 ఓవర్లు మాత్రమే ఆడింది. ఇందులోనే భారత్ నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయింది. వరుణుడు అడ్డు తగలడంతో పాటు వెలుతురు లేమి కూడా తోడవ్వడంతో మూడో రోజు ఆటను తొందరగానే ముగించారు.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి (3),రిషబ్ పంత్ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత బ్యాటర్లంతా చెత్త షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. స్టార్క్ (2/25), హాజిల్‌వుడ్ (1/17), కమిన్స్ (1/7) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో అలెక్స్ క్యారీ (70) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, ఆకాశ్‌దీప్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment