India vs Australia, 4th T20I: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20కి వేదికైన రాయ్‌పూర్ స్టేడియం గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ స్టేడియానికి అధికారులు కరెంటు కోత విధించినట్లు సమాచారం.
తాజాగా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో లైటింగ్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియానికి సంబంధించి రూ. 3.6 కోట్ల మేర కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, రాష్ట్ర క్రీడా విభాగానికి మధ్య సమన్వయ లోపం వల్ల 2009 నుంచి ఇప్పటి దాకా ఇలా కోట్ల రూపాయల చెల్లింపులు అలాగే నిలిచిపోయాయి. నిజానికి రాయ్‌పూర్ స్టేడియం నిర్మాణం తర్వాత నిర్వహణ బాధ్యతలను పీడబ్ల్యూడీకే అప్పగించారు.
అయితే, అదనంగా ఏవైనా సదుపాయాలు కల్పించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఖర్చును క్రీడా శాఖ భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఇరు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు ఇక్కడిదాకా దారి తీసినట్లు తెలుస్తోంది.
కుప్పలా పేరుకుపోతున్న బిల్లు చెల్లింపుల గురించి ఇప్పటికే విద్యుత్ శాఖ ఈ రెండు శాఖలకు నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ సందిగ్దంలో పడింది.
కరెంట్ కోత తర్వాత 2018 నుంచి రాయ్‌పూర్ స్టేడియంలో కేవలం ఒకే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అది కూడా వన్డే! అప్పుడు కూడా జెనరేటర్ల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మమ అనిపించారు. ఈ విషయం గురించి.. చత్తీస్‌గడ్ స్టేట్ క్రికెట్ సంఘ్ మీడియా కో ఆర్డినేటర్ తరుణేశ్ సింగ్ పరిహార్ మాట్లాడుతూ..
‘‘అంతర్జాతీయ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా మాకుంది. నిజానికి స్టేడియం, లైట్లకు సంబంధించి ఎంత కరెంటు వినియోగం జరిగింది? బిల్లు ఎంతైంది? అన్న విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు.
అయితే, తాజా మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ సంఘ్ అభ్యర్థన మేరకు విద్యుత్ శాఖ తాత్కాలిక కనెక్షన్ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా రాయ్‌పూర్ స్టేడియంలో అంతర్జాతీయ టీ20 జరగడం ఇదే తొలిసారి. ఇక శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
చదవండి: ఇర్ఫాన్‌తో ప్రేమ.. గంభీర్ మిస్డ్‌కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment