మెల్‌బోర్న్ టెస్ట్ నాలుగో రోజు ఆసీస్ చివరి వరుస ఆటగాళ్లు నాథన్ లయోన్ (41 నాటౌట్), స్కాట్ బోలాండ్ (10 నాటౌట్) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ 110 బంతులు ఎదుర్కొని చివరి వికెట్‌కు అమూల్యమైన 55 పరుగులు జోడించారు.
లయోన్, బోలాండ్‌ను ఔట్ చేసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. మరికొద్ది సేపట్లో ఆట ముగుస్తుందనగా బుమ్రా లయోన్‌ను ఔట్ చేసినప్పటికీ అది నో బాల్ అయ్యింది. లయోన్-బోలాండ్ భాగస్వామ్యం పుణ్యమా అని ఆసీస్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది.
ఐదో రోజు ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం టీమిండియాకు అంత ఈజీ కాదు. మెల్‌బోర్న్ మైదానంలో ఇప్పటివరకు ఛేదించిన అతి భారీ లక్ష్యం 332. ఈ సంఖ్యను ఆసీస్ నాలుగో రోజే దాటేసింది. ఐదో రోజు లయోన్, బోలాండ్ తమ అద్బుత బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తే లక్ష్యం మరింత పెద్దది అవుతుంది.
లయోన్, బోలాండ్ చివరి వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆఖరి రోజు ఏమైనా జరిగేందుకు ఆస్కారముంది. ఆస్ట్రేలియా, భారత్‌లలో ఏ జట్టైనా మ్యాచ్ గెలవచ్చు. మ్యాచ్ డ్రా లేదా టై కూడా కావచ్చు.
తొలుత దెబ్బేసిన లబూషేన్, కమిన్స్
ఈ మ్యాచ్‌లో భారత్‌ను తొలుత లబూషేన్ (70), కమిన్స్ (41) దెబ్బేశారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. బుమ్రా, సిరాజ్ రెచ్చిపోవడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్, కమిన్స్ పుణ్యమా అని అనూహ్యంగా పుంజుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంతోనే ఆసీస్ గెలుపు రేసులోకి వచ్చింది. అంతవరకు ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు.
91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్.. లబూషేన్-కమిన్స్, లయోన్-బోలాండ్ జోడీలు అతి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి రోజు 96 ఓవర్ల పాటు ఆట జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment