బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ ఆల్‌టైమ్ రికార్డు ఊరిస్తుంది. సిడ్నీ టెస్ట్‌లో బుమ్రా మరో ఆరు వికెట్లు తీస్తే.. ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.
ప్రస్తుతం ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ 1972-73లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 35 వికెట్లు తీశారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో 12.83 సగటున 30 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు ఐదు వికెట్లు ఘనతలు ఉండగా..రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
1. బీఎస్ చంద్రశేఖర్ - 35 (ఇంగ్లండ్‌పై)
2. వినూ మన్కడ్ - 34 (ఇంగ్లండ్‌పై)
3. శుభాష్‌చంద్ర గుప్తా - 34 (న్యూజిలాండ్‌పై)
4. రవిచంద్రన్ అశ్విన్ - 32 (ఇంగ్లాండ్‌పై)
5. హర్భజన్ సింగ్ - 32 (ఆస్ట్రేలియాపై)
6 .కపిల్ దేవ్ - 32 (పాకిస్థాన్‌పై)
7. రవిచంద్రన్ అశ్విన్ - 31 (దక్షిణాఫ్రికాపై)
8. బిషన్ సింగ్ బేడీ - 31 (ఆస్ట్రేలియాపై)
9. జస్ప్రీత్ బుమ్రా - 30 (ఆస్ట్రేలియాపై)
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నాలుగు టెస్ట్‌ల అనంతరం ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆతర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా కాగా.. తాజాగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment