U19 WC Ind vs Aus: జగజ్జేతగా ఆసీస్‌ .. ఇలాంటివి లెక్కలోకి రావు! | Ind vs Aus At U19 Team Results Dont Matter: Kaif Brings Back on paper Remark | Sakshi
Sakshi News home page

U19 WC Ind vs Aus: ఇలాంటివి లెక్కలోకి రావు.. ఈసారి ఆసీస్‌ మాత్రం!

Published Mon, Feb 12 2024 11:46 AM | Last Updated on Mon, Feb 12 2024 12:30 PM

Ind vs Aus At U19 Team Results Dont Matter: Kaif Brings Back on paper Remark - Sakshi

ICC Under 19 World Cup 2024: క్రికెట్‌ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా మరో ఐసీసీ టైటిల్‌ సాధించింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్లో భారత యువ జట్టుపై గెలిచి నాలుగోసారి జగజ్జేగతగా అవతరించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను 79 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం అందుకుని ఏ ఫార్మాట్లోనైనా తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది.

ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023లో సీనియర్‌ జట్టు మాదిరిగానే.. కుర్రాళ్లూ కంగారూల ధాటికి కంగారెత్తి ఒత్తిడిలో చిత్తయ్యారు. ఫలితంగా ఆరోసారి ప్రపంచకప్‌ గెలవాలన్న యువ భారత్‌ ఆశలు అడియాలసయ్యాయి. రోహిత్‌ సేన మాదిరే.. ఉదయ్‌ సహారన్‌ బృందం కూడా కీలక పోరులో ప్రత్యర్థి ముందు తలవంచడంతో మరోసారి ఆసీస్‌ చేతిలో భంగపాటు తప్పలేదు.

ఇలాంటివి అసలు లెక్కలోకే  తీసుకోరు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అండర్‌-19 స్థాయిలో క్రికెట్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితాలు పెద్దగా పరిగణనలోకి రావు. అయితే, ఈ టోర్నీలో సుదీర్ఘ ప్రయాణం ద్వారా భవిష్య క్రికెట్‌ స్టార్లు తమ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం మాత్రం ఉంటుంది.

భారత జట్టు చాలా బాగా ఆడింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా పేపర్‌ మీద మాత్రమే కాదు.. మైదానంలో కూడా మెరుగ్గానే కనిపించింది’’ అని కైఫ్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

‘‘ఇప్పటికైనా కైఫ్‌ బాయ్‌ ఆస్ట్రేలియా ప్రదర్శనను మెచ్చుకున్నాడు’’ అని కొంతమంది.. ‘‘అండర్‌-19 వరల్డ్‌కప్‌లోనూ మనం ఓడిపోయాం కాబట్టే.. ఈ విజయం లెక్కలోకి రాదంటున్నాడు కైఫ్‌’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

అప్పుడు పేపర్‌ మీద మనమే బెస్ట్‌ అంటూ..
కాగా భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన భారత మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌..  ‘‘అత్యుత్తమ జట్టు టైటిల్‌ గెలిచిందంటే నేను అస్సలు ఒప్పుకోను.

పేపర్‌ మీద చూస్తే టీమిండియా అత్యుత్తమంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కైఫ్‌ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా వల్ల.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాకు మూడుసార్లు పరాభవం ఎదురైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌, వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌.. భారత క్రికెట్‌ జట్లను ఓడించి.. టైటిల్స్‌ ఎగురేసుకుపోయింది.

చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement