‘‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చుల(Langurs) ‘సాయం’ కోరింది. ప్రేక్షకులు, తమ కెమెరాల భద్రతకై కాపలాగా ఉండేందుకు వాటి యజమానులను ఒప్పించింది’’.. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే!.. అసలు విషయం ఏమిటంటే..!?
కాన్పూర్‌లో రెండో టెస్టు
టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలుత చెన్నైలో టెస్టు జరుగగా.. రోహిత్ సేన 280 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం రెండో టెస్టు కోసం ఇరుజట్లు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు వచ్చాయి.
ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్- బంగ్లా మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసిపోయింది. బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ ఆకాశ్ దీప్ రెండు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లా మధ్య రెండో టెస్టుకు వేదికైన గ్రీన్ పార్క్ స్టేడియం అంటే కోతులకు బాగా ఇష్టమట. గ్రౌండ్ ఖాళీగా ఉన్నపుడు గుంపులుగా అక్కడికి వచ్చి ఆటలాడుతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. మ్యాచ్ సమయంలోనూ ప్రేక్షకుల వద్దకు వచ్చి తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయట.
అందుకే కొండముచ్చులను తీసుకువచ్చాం
ఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌కు ముందు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చులను హ్యాండిల్ చేసే వ్యక్తులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి గ్రీన్ పార్క్ స్టేడియం డైరెక్టర్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘కోతులు ఇక్కడ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకే వాటిని కట్టడి చేసేందుకు, ఇక్కడికి వచ్చే వాళ్లకు భద్రత కల్పించేందుకు కొండముచ్చులను తీసుకువచ్చాం’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.
కాగా గ్రీన్ పార్క్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు కొండముచ్చులు కాపలా కాయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ముఖ్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కెమెరా పర్సన్ దగ్గర కోతుల బెడదను నివారించేందుకు వీటిని అక్కడ మోహరించేవారు. అదీ సంగతి!!
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment