IND VS ENG 1st Test: అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్‌ | IND vs ENG, 1st Test: R Ashwin 10 Wickets Away From 500 Test Wickets Milestone | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్‌

Published Mon, Jan 22 2024 8:39 PM | Last Updated on Tue, Jan 23 2024 9:34 AM

IND VS ENG 1st Test: Ashwin 10 Wickets Away From 500 Test Wickets Mile Stone - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. త్వరలో (జనవరి 25 నుంచి) ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి టెస్ట్‌లో (హైదరాబాద్‌) అశ్విన్‌ మరో 10 వికెట్లు తీస్తే, టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. హైదరాబాద్‌ టెస్ట్‌లో యాష్‌ ఈ ఘనతను సాధిస్తే అనిల్‌ కుంబ్లే తర్వాత భారత్‌ తరఫున 500 వికెట్లు మార్కును తాకిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

అశ్విన్‌ మరో 10 వికెట్లు పడగొడితే టెస్ట్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. అశ్విన్‌కు ముందు మురళీథరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ ఆండర్సన్‌ (690), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), మెక్‌గ్రాత్‌ (563), కోట్నీ వాల్ష్‌ (519), నాథన్‌ లయోన్‌ (512) టెస్ట్‌ల్లో 500 వికెట్ల ఘనత సాధించారు. 

హైదరాబాద్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌ను మిస్‌ కానున్నాడు. వ్యక్తిగత కారణాల చేత విరాట్‌ తొలి టెస్ట్‌తో పాటు రెండో టెస్ట్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. తొలి టెస్ట్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇదివరకే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. బాల రాముడి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం కోసం అశ్విన్‌, రవీంద్ర జడేజా అయోధ్య నగరికి వెళ్లారు. వీరిద్దరూ రేపటి లోగా జట్టుతో చేరతారు. ఈ సిరీస్‌లో భారత్‌.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది.

తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. విరాట్‌ కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది. తొలి టెస్ట్‌కు ముందు మ్యాచ్‌కు వేదిక అయిన హైదరాబాద్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారత ఆటగాళ్లతో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.

మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి, భారత అప్‌కమింగ్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌లకు అవార్డులు దక్కనున్నాయని తెలుస్తుంది. శాస్త్రికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. గిల్‌కు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కనున్నాయని సమాచారం. వీరితో పాటు ముంబై ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, షమ్స్‌ ములానీలకు కూడా అవార్డు దక్కనున్నట్లు తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement