ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు రెండో సెషన్ (32.5 ఓవర్లు) సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 121/4గా ఉంది. జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35), ఓలీ పోప్ (1), జానీ బెయిర్‌స్టో (37) ఔట్ కాగా.. జో రూట్ (26), బెన్ స్టోక్స్ (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, రవి జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
Hyderabad crowd cheering "Kohli, Kohli, Kohli". 🐐
— Johns. (@CricCrazyJohns) January 25, 2024
- Fans are missing Kohli in the first Test. pic.twitter.com/WFcdR6OxOQ
కాగా, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడకపోయినా అతని నామస్మరణతో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోతుంది. తమ ఆరాధ్య క్రికెటర్‌ను స్మరించుకుంటూ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ముఖ్యంగా యువత అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది.
కోహ్లి ఫోటోలను పట్టుకుని ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇవాళ వర్కింగ్ డే కావడంతో స్టేడియంలో జనాలు పలచగా కనిపించినా.. అక్కడున్న వారు మాత్రం కోహ్లి పేరును జపిస్తూ మ్యాచ్‌ను చూస్తున్నారు. ఓ పక్క భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. లోకల్ బాయ్ సిరాజ్ అద్బుతమైన క్యాచ్ పట్టినప్పుడు కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది.
కోహ్లికి అచ్చొచ్చిన ఉప్పల్.. డబుల్‌తో చెలరేగిన రన్ మెషీన్
2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్‌లో టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్
Comments
Please login to add a commentAdd a comment