చిచ్చరపిడుగు సర్ఫరాజ్‌ ఖాన్‌.. తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధసెంచరీ IND VS ENG 3nd Test Day 1: Sarfaraz Khan Scored Blasting Half Century In Debut Innings | Sakshi
Sakshi News home page

చిచ్చరపిడుగు సర్ఫరాజ్‌ ఖాన్‌.. తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధసెంచరీ

Published Thu, Feb 15 2024 4:43 PM | Last Updated on Thu, Feb 15 2024 5:11 PM

IND VS ENG 3nd Test Day 1: Sarfaraz Khan Scored Blasting Half Century In Debut Innings - Sakshi

భారత్‌-ఇంగ్లండ్‌ మూడో టెస్ట్‌ ద్వారా టెస్ట్‌ అరంగేట్రం చేసిన టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర​ సర్ఫరాజ్‌ ఖాన్‌ తొలి టెస్ట్‌లోనే (తొలి ఇన్నింగ్స్‌) మెరుపు అర్దసెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔటయ్యాక ఆరో స్థానంలో బరిలోకి దిగిన సర్ఫరాజ్‌ కేవలం 48 బంతుల్లోనే అర్దసెంచరీ బాది క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ 7 ఫోర్లు, సిక్సర్‌ బాదాడు.

దేశవాలీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉన్న సర్ఫరాజ్‌.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకుని, తొలి ఇన్నింగ్స్‌లోనే తన మార్కు ప్రభావం చూపాడు. సర్ఫరాజ్‌కు దేశవాలీ క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా పేరుంది. ఆ బిరదును సర్ఫరాజ్‌ తన తొలి టెస్ట్‌ ఇన్ని‍ంగ్స్‌లోనే నిజం​ చేశాడు. సర్ఫరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం బెరుకు లేకుండా షాట్లు ఆడి, అనుభవజ్ఞుడైన ఆటగాళ్లను తలపించాడు.

సర్ఫరాజ్‌ దగ్గర దూకుడుతో పాటు మంచి టెక్నిక్‌ కూడా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో అతను షాట్లు ఆడిన విధానం చూస్తే ఈ విషయం సృస్పష్టం అవుతుంది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ భారత క్రికెట్‌ అభిమానుల గుండెల్లో స్థానం​ సంపాదించాడు. ఇవాళ సర్ఫరాజ్‌ అరంగేట్రానికి ముందు అతని తండ్రి నౌషధ్‌ ఖాన్‌, భార్య రొమానా జహూర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

వీరిద్దరూ సర్ఫరాజ్‌ ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా క్రికెటర్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ముగిసిన అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో ముషీర్‌ వరుస సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరడంలో ముషీర్‌ కీలకపాత్ర పోషించాడు. సర్ఫరాజ్‌, ముషీర్‌ క్రికెటర్లుగా రాణించడంలో తండ్రి నౌషద్‌ ఖాన్‌ది కీలక పాత్ర. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా.. 80 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా 96, సర్ఫరాజ్‌ ఖాన్‌ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పాటిదార్‌ (5) నిరాశపరిచగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమై సెంచరీతో (131) మెరిశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, టామ్‌ హార్ల్టీ ఓ వికెట్‌ పడగొట్టారు.

చదవండి: #Sarfaraz Khan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తండ్రి, భార్య కన్నీటి పర్యంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement