నా భార్యకు అంకితం.. జడ్డూ ఎందుకిలా చేశావు? | Ind vs Eng 3rd Test Jadeja Dedicates POTM Award To Wife Fans Reacts | Sakshi
Sakshi News home page

నా భార్యకు అంకితం.. జడ్డూ ఎందుకిలా చేశావు?

Published Mon, Feb 19 2024 2:45 PM | Last Updated on Mon, Feb 19 2024 3:44 PM

Ind vs Eng 3rd Test Jadeja Dedicates POTM Award To Wife Fans Reacts - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అదరగొట్టాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చి.. సొంత మైదానం ‘రాజ్‌కోట్‌’లో రాజులా తలెత్తుకున్నాడు. భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి.. ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు’’ అందుకున్నాడు. అనంతరం అవార్డును భార్య రివాబాకు అంకితమిస్తూ ఆమెపై ప్రేమను చాటుకున్నాడు జడ్డూ. 

కాగా రాజ్‌కోట్‌ టెస్టుకు ముందు జడ్డూ- రివాబాపై అతడి తండ్రి అనిరుద్‌ సిన్హ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత రవీంద్ర పూర్తిగా మారిపోయాడని.. కోడలి వల్లే తమకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

రివాబా రాకతో కుటుంబం విఛ్చిన్నమైపోయిందని.. కనీసం తన మనవరాలిని ఒక్కసారి కూడా చూడనివ్వలేదని వాపోయాడు. తాను కష్టపడి కుమారుడిని క్రికెటర్‌ను చేశానని పేర్కొన్న అనిరుద్‌ సిన్హ.. రవీంద్ర సంపాదనపై అతడి భార్య, అత్తమామల పెత్తనం ఎక్కువైపోయిందని ఆరోపించాడు.

అయితే, ఇందుకు సోషల్‌ మీడియా వేదికగా బదులిచ్చిన  రవీంద్ర జడేజా.. తన భార్య, బీజేపీ ఎమ్మెల్యే అయిన రివాబాపై బురద జల్లేందుకే ఇలాంటి పెయిడ్‌ ఇంటర్వ్యూలు అని మండిపడ్డాడు.‍ ఈ నేపథ్యంలో తాజాగా తన అవార్డును భార్యకు ఇలా అంకితమివ్వడం విశేషం.

జడ్డూ ఎందుకిలా చేశావు?
తద్వారా సతీమణిపై తనకున్న ప్రేమను జడ్డూ మరోసారి చాటుకున్నాడని అభిమానులు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం.. ‘‘జడ్డూ చేష్టలు అతడి తండ్రిని మరింత బాధపెట్టేవిగా.. రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. నిజానికి అతడు క్రికెటర్‌గా ఎదగడంలో తండ్రి, సోదరిది కీలక పాత్ర తనే గతంలో చెప్పాడు’’ అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా హైదరాబాద్‌ టెస్టులో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ క్రమంలో వైజాగ్‌లో రెండో మ్యాచ్‌కు దూరమైన అతడు.. మూడో టెస్టుతో తిరిగి వచ్చాడు. శతకం(112) బాదడంతో పాటు మొత్తంగా ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రాత్మక విజయంలో భాగమయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement