50 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.. ఓవల్ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
368 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా జట్టుగా రాణించి ఓవల్ గడ్డపై 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది. ఉమేశ్ బౌలింగ్‌లో ఆండర్సన్(2) ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 210 పరుగుల వద్ద తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
చారిత్రక గెలుపుకు ఒకే ఒక్క వికెట్ దూరంలో..
50 ఏళ్ల నిరీక్షణకు మరో కొద్ది నిమిషాల్లో తెరపడనుంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో గెలుపుకు టీమిండియా ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓవర్టన్(10) క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ 202 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో రాబిన్సన్(4), ఆండర్సన్ ఉన్నారు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్
నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి దాదాపుగా ఖరారైంది. 193 పరుగుల వద్ద ఆ జట్టు కీలకమైన క్రిస్ వోక్స్(18) వికెట్‌ను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో వోక్స్ ఎనిమిదవ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా చారిత్రక గెలుపుకు మరో రెండు వికెట్ల దూరంలో ఉంది. క్రీజ్‌లో ఓవర్టన్(5) ఉన్నాడు. అంపైర్లు టీ విరామం ప్రకటించారు.
రూట్(36) క్లీన్ బౌల్డ్.. గెలుపుకు మరో 3 వికెట్ల దూరంలో టీమిండియా
ఇంగ్లండ్ ఆఖరి ఆశాకిరణం రూట్(36) ఎట్టకేలకు పెవిలియన్‌కు చేరాడు. జట్టు స్కోర్ 182 పరుగుల వద్ద శార్దూల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ మ్యాచ్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. వోక్స్(12)కు జతగా ఓవర్టన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 186 పరుగులు సాధించాల్సి ఉండగా, చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మొయిన్ అలీ డకౌట్
టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు పేకమేడలా కూలుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు వరుస పెట్టి పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉండగా మొయిన్ అలీ డకౌట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో సబ్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టడంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జో రూట్(18)కు జతగా క్రిస్ వోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 221 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
బుమ్రా ఉగ్రరూపం.. బెయిర్‌స్టో(0) క్లీన్ బౌల్డ్
టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఉగ్రరూపం దాల్చాడు. 5 బంతుల వ్యవధిలో ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపి ఆతిధ్య జట్టు నడ్డి విరిచాడు. 146 పరుగుల వద్ద తొలుత ఓలీ పోప్(2)ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా అదే స్కోర్ వద్ద బెయిర్‌స్టోను సైతం బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఓటమికి పునాది వేశాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 146 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. జో రూట్(17)కు జతగా మొయిన్ అలీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్నాయి.
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బుమ్రా బౌలింగ్‌లో ఓలీ పోప్(2) క్లీన్ బౌల్డ్
5 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ మరో వికెట్ కోల్పోయింది. 141 పరుగుల వద్ద హమీద్ వికెట్ కోల్పోయిన ఆతిధ్య జట్టు 146 పరుగుల స్కోర్ వద్ద ఓలీ పోప్(2) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. జో రూట్(17)కు జతగా జానీ బెయిర్‌స్టో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 222 పరుగులు సాధించాల్సి ఉంది. చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్నాయి.
ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్.. హమీద్(63) క్లీన్ బౌల్డ్
లంచ్ తర్వాత మూడో ఓవర్‌లోనే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న హసీబ్ హమీద్(63; 6 ఫోర్లు)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఆతిధ్య జట్టు మూడో వికెట్ కోల్పోయింది. జో రూట్(14)కు జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 227 పరుగులు సాధించాల్సి ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(5) రనౌట్
జట్టు స్కోర్ 120 పరుగుల వద్ద నుండగా ఇంగ్లండ్‌కు మరో దెబ్బ తగిలింది. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్(5) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మయాంక్ అగర్వాల్ అద్భుతమై త్రోతో మలాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. హసీబ్ హమీద్(60)కు తోడుగా కెప్టెన్ రూట్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 248 పరుగులు సాధించాల్సి ఉంది.
వేట మొదలైంది.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
291 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్(50; 5 ఫోర్లు) అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. శార్దూల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పంత్ క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ 100 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హమీద్(47) నిలకడగా అడుతుండగా, మలాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 268 పరుగులు సాధించాల్సి ఉంది.
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది.
కాగా, 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, 290 వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..?
Comments
Please login to add a commentAdd a comment