ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (91) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ (90) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
రాంచీలో టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రూట్ జట్టు కష్టాల్లో (47/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి అర్దసెంచరీ సాధించాడు. ప్రస్తుతం అతను 67 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
కెరీర్‌లో 139వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రూట్.. 30 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సాయంతో 11560 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉంది. కుక్ తన 161 మ్యాచ్‌ల కెరీర్‌లో 33 సెంచరీలు, 57 అర్దసెంచరీల సాయంతో 12472 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాంచీ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11), ఓలీ పోప్ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్ స్టోక్స్ (3) ఔట్ కాగా.. రూట్ (67), బెన్ ఫోక్స్ (28) క్రీజ్‌లో ఉన్నారు. భారత అరంగేట్రం బౌలర్ ఆకాశ్‌దీప్ 3 వికెట్లతో విజృంభించగా.. రవీంద్ర జడేజా, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment