భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా | IND VS ENG: Jasprit Bumrah Sets New India Wickets Record For A Series In England | Sakshi
Sakshi News home page

IND VS ENG: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా

Published Mon, Jul 4 2022 12:10 PM | Last Updated on Mon, Jul 4 2022 12:10 PM

IND VS ENG: Jasprit Bumrah Sets New India Wickets Record For A Series In England - Sakshi

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టిన (టెస్ట్ క్రికెట్‌లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (31)) బుమ్రా తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 

2014 సిరీస్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ పడగొట్టిన 19 వికెట్లే (5 మ్యాచ్‌ల సిరీస్‌లో) ఇప్పటివరకు అత్యధికం కాగా, తాజా సిరీస్‌లో బుమ్రా.. భువీ రికార్డును తిరగరాశాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్‌ (2007లో 18 వికెట్లు), ఇషాంత్‌ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్‌ గుప్తే (1959లో 17 వికెట్లు)‌ బుమ్రా, భువీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా టీమిండియా తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్లకు దక్కుతుంటుంది. అయితే ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక వికెట్లు (ఓ సిరీస్‌లో) సాధించిన టాప్‌-5 బౌలర్లలో ఒక్కరే స్పిన్నర్‌ ఉండటం విశేషం.సుభాశ్‌ గుప్తే.. 1959 ఇంగ్లండ్‌ సిరీస్‌లో (5 టెస్ట్‌ మ్యాచ్‌లు) 17 వికెట్లు సాధించాడు.   

కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదో స్థానంలో బరిలోకి దిగి బ్యాట్‌తో (16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 31 పరుగులు) చెలరేగిన బుమ్రా..  ఆతర్వాత బంతితోనూ, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. తొలుత ఇంగ్లండ్‌ టాప్‌ 3 బ్యాటర్లను ఔట్‌ చేసి బుమ్రా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో అద్భుతమైన డైవిండ్‌ క్యాచ్‌ అందుకుని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

ఇక మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్ప్‌లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత్‌.. ఓవరాల్‌గా 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. పుజారా (50), పంత్‌ (30) క్రీజ్లో ఉన్నారు. నాలుగో రోజు ఆటలో టీమిండియా మరో 100 పరుగులు చేయగలిగితే మరింత పటిష్ట స్థితికి చేరుకుంటుంది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు, ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 
చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement