రోహిత్ శర్మ
India vs England, 1st Test: యువ జట్టును ఒంటిచేత్తో గెలిపించాల్సిన బాధ్యత టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మపై ఉందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ చాలా ఏళ్ల పాటు ఇలాంటి పాత్ర పోషించాడని... ప్రస్తుతం రోహిత్ కూడా అదే పని చేయాలని సూచించాడు.
కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం నల్లేరు మీద నడకలా సాగుతుందనుకుంటే.. అనూహ్యరీతిలో పరాజయం పాలైంది.
ముఖ్యంగా లక్ష్య ఛేదనలో (రెండో ఇన్నింగ్స్) టీమిండియా తడ‘బ్యాటు’కు గురైన తీరు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మాజీ క్రికెటర్లు సైతం రోహిత్ సేన ఆట తీరును విశ్లేషిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
జైస్వాల్ ఆడలేకపోవడానికి కారణం అదే
ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 100 స్ట్రైక్‌రేటుతో 80 పరుగులు సాధించాడు.
కానీ రెండో ఇన్నింగ్స్‌లో అతడి స్ట్రైక్‌రేటు 40 మరీ నలభైకి పడిపోయింది. ఇందుకు కారణం.. అతడు ఒత్తిడిలో కూరుకుపోవడమే! ఇలాంటి సందర్భాల్లోనే రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ మాదిరి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేయాలి.
టెండుల్కర్ ఎన్నో ఏళ్లపాటు జట్టుకు సేవ చేసిన విధంగా... కష్ట సమయంలో తానున్నానంటూ బాధ్యతగా ఆడుతూ భారం మీద వేసుకోవాలి. నిజానికి ఈ మ్యాచ్‌లో టీమిండియా అతి జాగ్రత్తగా ఆడింది.
వాళ్లని దూకుడుగా ఆడనివ్వాలి
యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ లేదంటే శ్రేయస్ అయ్యర్... ఇలాంటి వాళ్లకు అటాకింగ్ ప్లేయర్లుగా గుర్తింపు ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్లు ఇలాగే ఆడాలి కదా! తమ సహజ శైలికి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి.
ఒకవేళ వాళ్లు మంచి ఆడినప్పటికీ జట్టు ఓడిపోతే.. అప్పుడు అభిమానులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. కనీసం మనవాళ్లు ప్రయత్నించారు కదా అని సరిపెట్టుకుంటారు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రోహిత్ శర్మ మొత్తం కలిపి 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: కుర్రాళ్లకు అనుభవం లేదు.. మరో 70-80 చేయాల్సింది: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment