ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన యూరో కప్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో మిత్రుడితో పంత్, గరాని
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ఆందోళన కలిగించే పరిణామం చోటు చేసుకుంది. టీమ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు కరోనా సోకినట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ నెల 8వ తేదీనే పంత్ కోవిడ్–19 పాజిటివ్‌గా తేలినట్లు, గత వారం రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న అతను ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది. జులై 7న రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందే పంత్ ‘డెల్టా–3’ వేరియంట్ సోకినట్లు భావిస్తున్నారు. జట్టు ట్రైనింగ్ అసిస్టెంట్/ నెట్ బౌలర్ అయిన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు.
గరానికి కోవిడ్ సోకినట్లు గురువారం బయటపడింది. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. గరానితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 10 రోజుల పాటు తమ హోటల్ గదుల్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. కరోనా తీవ్రతను ఎదుర్కోవడంలో భాగంగా భారత జట్టు ఆటగాళ్లందరికీ, వారి కుటుంబ సభ్యులతో సహా లండన్‌లో రెండో డోసు టీకాలు ఇచ్చినట్లు కూడా వెల్లడించిన బీసీసీఐ... ఇప్పుడు కూడా ప్రతీ రోజు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
మిగతా ఆటగాళ్లు డర్హమ్‌కు...
విరామం అనంతరం భారత ఆటగాళ్లు మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బృందం కౌంటీ సెలక్ట్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఐదుగురు మినహా మిగతావారంతా ఈ మ్యాచ్ కోసం గురువారం సాయంత్రం లండన్‌నుంచి డర్హమ్‌కు చేరుకున్నారు. పంత్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని...వరుసగా రెండు ఆర్టీపీసీఆర్ టెస్టులు నెగెటివ్‌గా వస్తే అతనూ జట్టుతో చేరతాడని బోర్డు వెల్లడించింది.
అయితే ‘నెగెటివ్’గా వచ్చినా కోలుకునేందుకు సమయం పడుతుంది కాబట్టి అతను ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సాహా కూడా ఐసోలేషన్‌లో ఉండటంతో కేఎల్ రాహుల్ కీపర్‌గా వ్యవహరించవచ్చు. మరో వైపు భారత్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడే ‘కౌంటీ సెలెక్ట్ ఎలెవన్’ జట్టును ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే టెస్టులు ఆడిన జేమ్స్ బ్రాసీ, హసీబ్ హమీద్‌లు ఇందులో ఉన్నారు.
అదే కారణమా...
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత బీసీసీఐ భారత క్రికెటర్లకు మూడు వారాల ‘సెలవు’ ఇచ్చింది. అంటే కేవలం ప్రాక్టీస్ సెషన్లు, టీమ్ మీటింగ్‌లనుంచి విరామంలాంటిది కాకుండా పూర్తిగా జట్టుతో సంబంధం లేకుండా తమ ఇష్టప్రకారం ఇంగ్లండ్‌లో షికారుకు అవకాశం ఇచ్చింది. దాంతో అందరు ఆటగాళ్లు స్వేచ్ఛగా తమకు నచ్చిన చోట్లకు వెళ్లారు. వీరిలో కొందరు లండన్‌లోని టీమ్ హోటల్‌లోనే ఉండేందుకు ఇష్టపడగా, మరికొందరు వేరే చోట ఉన్నారు. పంత్ కూడా విడిగా బయటే ఉన్నాడు. ఈ క్రమంలోనే కొందరు మిత్రులను కలిసిన అతను జూన్ 29న ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన యూరో కప్ మ్యాచ్‌కు కూడా హాజరయ్యాడు. ఆ తర్వాతే స్వల్ప జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షకు సిద్ధమైనట్లు తెలిసింది. నిజానికి ఇంగ్లండ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ‘డెల్టా’ వేరియంట్ అక్కడ చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. పైగా ఆంక్షలు సడలించిన తర్వాత జనం విచ్చలవిడిగా తిరగడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
బుధవారం కూడా 40 వేలకు పైగా ‘పాజిటివ్’లు నమోదయ్యాయి. ఇలాంటి స్థితిలో సమస్య కొనితెచ్చుకోవద్దంటూ కొద్ది రోజుల క్రితమే బీసీసీఐ లేఖ ద్వారా ఆటగాళ్లను హెచ్చరించింది కూడా. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే యూరో కప్, వింబుల్డన్ మ్యాచ్‌లకు వెళ్లవద్దని...వ్యాక్సిన్ వేసుకున్నా సరే, పూర్తిగా భద్రత లభించదని కూడా ముందే స్పష్టంగా చెప్పింది. అయినా సరే, క్రికెటర్లు పెద్దగా జాగ్రత్త వహించినట్లు కనిపించలేదు. పంత్ కోలుకుంటున్నాడు కాబట్టి ఇప్పటికిప్పుడు జరిగే ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. తొలి టెస్టు ఆగస్టు 4నుంచి కాబట్టి తగినంత సమయం కూడా ఉంది. స్వదేశంలో కరోనా కారణంగా ఐపీఎల్ అనూహ్యంగా వాయిదా పడిన తర్వాత భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ బయో బబుల్ మొదలు ఎన్నో అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా సరే జట్టు సభ్యుడొకరు ఇలా కరోనా బారిన పడటం దురదృష్టకరం. ఈ విషయంలో పంత్ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించాడనేది వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment