India tour of Ireland, 2023: టీమిండియా- పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్.. అదే విధంగా భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి మేటి జట్లతో పోటీ పడుతుందంటే స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. మరి ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే.. అది కూడా ఒకరిద్దరు మినహా మిగతా అంతా యువ ఆటగాళ్లతో కూడిన దాదాపు ద్వితీయ శ్రేణి జట్టు అంటే మ్యాచ్ చూసేందుకు వచ్చే వారెవరుంటారు?
ఇలా అనుకుంటే మాత్రం పొరపాటే! ఐర్లాండ్‌లో ఉన్న మన వాళ్లకు, స్థానికులకు ఇలాంటపుడే టీమిండియా ఆటగాళ్లను నేరుగా చూసే అవకాశం వస్తుంది కదా! అందుకే పోటీపడి మరి టీమిండియా- ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు కొనుగోలు చేశారు.
హౌజ్‌ఫుల్!
తొలి రెండు మ్యాచ్‌ల కోసం ఇప్పటికే మొత్తం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది ఐర్లాండ్ క్రికెట్ బోర్డు. మూడో టీ20కి సంబంధించి కూడా త్వరలోనే టిక్కెట్ల విక్రయ ప్రక్రియ ఆరంభిస్తామని తెలిపింది. టీమిండియాతో మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని హర్షం వ్యక్తం చేసింది.
బుమ్రా- ఎక్స్‌ప్రెస్‌కు పరీక్ష!
కాగా ఆగష్టు 18- 23 వరకు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లు ఐరిష్ టీమ్‌తో తలపడనున్నారు. ఏడాది కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా ఫిట్‌నెస్‌కు సంబంధించి ఈ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడనుంది.
చిన్న జట్లకు మేలు
ఇక ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో పటిష్ట భారత జట్టు ఇటీవలి కాలంలో ఎక్కువగా సిరీస్‌లు ఆడటం ఆయా జట్లకు మేలు చేస్తోంది. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టుతో పోటీ పడుతూ.. ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల మంచి ఆదాయం ఆర్జించేందుకు దోహదం చేస్తోంది కూడా!
ఇదే తొలిసారి
కాగా 2018, 2022లో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఇరు జట్లు పొట్టి ఫార్మాట్‌లో ఐదు సందర్భాల్లో తలపడ్డాయి. టీ20 వరల్డ్‌కప్-2009లో భాగంగా ఐర్లాండ్ టీమిండియాను ఢీకొనగా.. మిగతా నాలుగుసార్లు ద్వైపాక్షిక సిరీస్‌లో ముఖాముఖి పోటీపడింది. అయితే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి.
చదవండి: IND VS IRE 1st T20: చరిత్ర సృష్టించనున్న జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment