ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 25) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (80), శిఖర్ ధవన్ (72), శుభ్‌మన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది.
అనంతరం 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఆచితూచి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. 8వ ఓవర్‌లో శార్ధూల్ ఠాకూర్.. ఫిన్ అలెన్‌ను (22) బోల్తా కొట్టించడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ (35 పరుగుల వద్ద) కోల్పోయింది.
ఈ మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. లేట్‌గా బంతిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌల్ చేసిన ఉమ్రాన్.. తొలి బంతి నుంచే నిప్పులు చెరుగుతూ ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. ప్రతి బంతిని దాదాపుగా 150కిమీ వేగంతో సంధించిన ఉమ్రాన్.. తన స్పెల్ మూడో ఓవర్‌లో (ఇన్నింగ్స్ 16వ ఓవర్) తొలి వికెట్ పడగొట్టాడు. డేంజరెస్ డెవాన్ కాన్వేను (24) ఉమ్రాన్ బోల్తా కొట్టించాడు.
ఆపై తన 5వ ఓవర్‌లో ఉమ్రాన్ మరో వికెట్ తీశాడు. జట్టు స్కోర్ 88 పరుగుల వద్ద (19.5 ఓవర్లు) ఉండగా డారిల్ మిచెల్ (11)ను పెవిలియన్‌కు సాగనంపాడు. 20 ఓవర్లు ముగిసే సమయానికి.. తన స్పెల్‌లో 5 ఓవర్లు పూర్తి చేసిన ఉమ్రాన్ 19 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ పేస్‌కు తట్టుకోలేక కివీస్ బ్యాటర్లు బెంబేలెత్తిపోతుండగా.. టీమిండియా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. ఇక ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆగదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment