ఫాలోఆన్ ఇవ్వని భారత్ పాచిక పారింది. మూడో రోజు కోహ్లి బృందం చకచకా పరుగులు సాధించింది. కొండంత లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. ప్రత్యర్థి బరిలోకి దిగగానే స్పిన్ ఉచ్చు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసిన మయాంక్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించి భారత్‌ను శాసించే స్థితిలో నిలిపాడు. అనంతరం అశ్విన్ న్యూజిలాండ్‌ను తిప్పేసే పనిలో పడ్డాడు. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ టెస్టులో మరో ఐదు వికెట్లు తీస్తే భారత్ విజయం ఖరారు అవుతుంది. న్యూజిలాండ్ నెగ్గాలంటే ఆ జట్టు మరో 400 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ముంబై: టెస్టు సిరీస్ విజయానికి భారత్ చేరువైంది. నాలుగోరోజే ఒకట్రెండు సెషన్లలో ఆట ముగించేందుకు సిద్ధమైంది. టి20 సిరీస్ లాగే టెస్టు సిరీస్‌నూ అప్పగించేందుకు న్యూజిలాండ్‌కు సమయం వచ్చింది. మూడో రోజు భారత ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌లో మరో 207 పరుగులు చేసిన కోహ్లి సేన... బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టులోని సగం వికెట్లను కూల్చేసింది. కరిగించలేనంత లక్ష్యం... ‘డ్రా’ కోసం నిలబడలేనంత కష్టం కివీస్‌ను కమ్మేసింది. ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 70 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (62; 9 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (47; 6 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (47; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ (4/106) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. మరో స్పిన్నర్ రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 263 పరుగులతో కలిపి న్యూజిలాండ్ ముందు భారత్ 540 పరుగుల భారీలక్ష్యం నిర్దేశించింది. న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్ (3/27) కివీస్ పతనానికి బాట వేశాడు.
మయాంక్ ఫిఫ్టీ...
ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు జతచేసింది. మయాంక్ 90 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తయ్యింది. తొలి వికెట్‌కు 107 పరుగులు జతచేసిన మయాంక్, పుజారా జోడీకి ఎజాజ్ కళ్లెం వేశాడు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరిని ఔట్ చేశాడు. తర్వాత శుబ్‌మన్, కెప్టెన్ కోహ్లి స్కోరు పెంచారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జతచేశాక గిల్ ఆటను రచిన్ రవీంద్ర ముగించాడు.
జట్టు స్కోరు 200 పరుగులు దాటిన తర్వాత శ్రేయస్ (14)ను ఎజాజ్ బోల్తా కొట్టించగా, కోహ్లి (36; 1 ఫోర్, 1 సిక్స్)ని రచిన్ బౌల్డ్ చేశాడు. సాహా (13) విఫలమైనా... అక్షర్ పటేల్ (26 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టి20 ఇన్నింగ్స్ ఆడేశాడు. ఆఖరి సెషన్‌కు ముందే కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను అశ్విన్ మరింత కష్టాల్లో పడేశాడు. ఆరంభంలోనే ఓపెనర్ లాథమ్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్ ఆ తర్వాత యంగ్, రాస్ టేలర్‌లను పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం నికోల్స్ (36 బ్యాటింగ్), రచిన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) యంగ్ (బి) ఎజాజ్ 62; పుజారా (సి) టేలర్ (బి) ఎజాజ్ 47; శుబ్‌మన్ (సి) లాథమ్ (బి) రచిన్ 47; కోహ్లి (బి) రచిన్ 36; శ్రేయస్ (స్టంప్డ్) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 14; సాహా (సి) జేమీసన్ (బి) రచిన్ 13; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; జయంత్ (సి అండ్ బి) ఎజాజ్ 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (70 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 276
వికెట్ల పతనం: 1–107, 2–115, 3–197, 4–211, 5–217, 6–238, 7–276.
బౌలింగ్: సౌతీ 13–2–31–0, ఎజాజ్ 26–3–106–4, జేమీసన్ 8–2–15–0, సోమర్‌విల్లే 10–0–59–0, రచిన్ రవీంద్ర 13–2–56–3.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; విల్ యంగ్ (సి–సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 20; మిచెల్ (సి) జయంత్ (బి) అక్షర్ పటేల్ 60; రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6; నికోల్స్ (బ్యాటింగ్) 36; బ్లన్‌డెల్ (రనౌట్) 0; రచిన్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45 ఓవర్లలో 5 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 4–128, 5–129.
బౌలింగ్: సిరాజ్ 5–2–13–0, అశ్విన్ 17–7–27–3, అక్షర్ 10–2–42–1, జయంత్ 8–2–30–0, ఉమేశ్ 5–1–19–0.
Comments
Please login to add a commentAdd a comment