న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాభవంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమి తాము అస్సలు ఊహించలేదని విచారం వ్యక్తం చేశాడు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయామని.. అందుకే పరాజయం పాలయ్యామని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తమ కంటే మెరుగ్గా ఆడిందని.. వాళ్లు విజయానికి అర్హులేనన్నాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా భారత్ సొంతగడ్డపై కివీస్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పుణె వేదికగా గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది.
భారత బౌలర్లు రాణించినా
అయితే, ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించినా బ్యాటర్లు విఫలమయ్యారు. ఫలితంగా మరోసారి టీమిండియాకు కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు. పుణెలో శనివారం నాటి మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 113 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేము ఇది అస్సలు ఊహించలేదు. మా కంటే న్యూజిలాండ్ బాగా ఆడింది. మాకు గెలిచే అవకాశం వచ్చినా.. దానిని ఒడిసిపట్టలేకపోయాం. సవాళ్లకు ఎదురీదలేకపోయాం.
అందుకే ఈరోజు ఇక్కడ ఇలాంటి విపత్కరపరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. మా బ్యాటింగ్ బాగాలేదని అనుకోవడం లేదు. నిజానికి 20 వికెట్లు తీస్తే గెలిచే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అయితే, బ్యాటింగ్ సమయంలోనూ మేము పట్టుదలగా పోరాడాము.
ఓటమికి ఏ ఒక్కరినో నిందించను
కానీ గెలిచేందుకు ఆ పోరాటం సరిపోలేదు. ఇందులో పిచ్‌ను నిందించడానికి ఏమీ లేదు. ఇది సమిష్టి వైఫల్యం. బ్యాటర్లు లేదంటే బౌలర్లలో ఎవరో ఒకరిని మాత్రమే తప్పుబట్టి.. ఓటమికి వారినే బాధ్యులను చేసే రకం కాదు నేను!
కచ్చితంగా మరింత స్ట్రాంగ్‌గా తిరిగివస్తాం. వాంఖడేలో గెలిచేందుకు ప్రయత్నిస్తాం’’ అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని రోహిత్ శర్మ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు(అక్టోబరు 24- 28)
వేదిక: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె
టాస్: న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 259
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 156
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 255
టీమిండియా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 245
ఫలితం: 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
చదవండి: IND vs NZ: పుణె టెస్టులో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..?
Comments
Please login to add a commentAdd a comment