ఆదివారం శ్రీలంకతో సిరీస్ ముగిసింది... బుధవారం మళ్లీ కొత్త వన్డే సిరీస్ మొదలు... ప్రత్యర్థి మారిందే తప్ప భారత్‌కు సంబంధించి ఇది కొనసాగింపు మాత్రమే... వన్డే వరల్డ్‌కప్ దారిలో తమ అస్త్రశస్త్రాల గురించి పరీక్షించుకునేందుకు రోహిత్ శర్మ బృందానికి ఇది మరో అవకాశం... బంగ్లాదేశ్ గడ్డపై ఓటమి, ఆపై శ్రీలంకపై క్లీన్‌స్వీప్ తర్వాత న్యూజిలాండ్ సవాల్ ఎదురుగా నిలిచింది. మరోవైపు విలియమ్సన్, సౌతీలు లేక కివీస్ కాస్త బలహీనంగా మారింది. నాలుగేళ్ల విరామం తర్వాత భాగ్యనగరం అభిమానులకు వన్డే క్రికెట్ భాగ్యం కలగడం విశేషం.
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై మరో సిరీస్ విజయంపై దృష్టి పెట్టిన భారత జట్టు తొలి సమరానికి సిద్ధమైంది. నగరంలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డేకు వేదిక కానుంది.
లంకపై భారీ విజయం తర్వాత అదే జోరులో మరో సిరీస్ గెలుచుకునేందుకు భారత్ ముందు మంచి అవకాశం ఉంది. కివీస్‌కు సంబంధించి వన్డే వరల్డ్‌కప్ కోసం తిరిగి వచ్చే ముందు భారత్‌లో పరిస్థితులు అంచనా వేసేందుకు ఈ టూర్ ఉపయోగపడవచ్చు.
మార్పులతో...
ఆదివారం జరిగిన మ్యాచ్‌తో పోలిస్తే తుది జట్టులో మార్పులు ఖాయం. లంకతో మూడో వన్డే ఆడిన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోగా, శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. రాహుల్ స్థానంలో కీపర్‌గా ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో ఆడతాడని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు.
గత మ్యాచ్‌లో హార్దిక్‌కు బదులుగా సూర్యకుమార్ ఆడగా, ఇప్పుడు శ్రేయస్ తప్పుకోవడంతో వీరిద్దరు టీమ్‌లో ఉండటం ఖాయమైంది. టాపార్డర్ దుర్భేద్యంగా ఉండటంతో కివీస్‌కు కష్టాలు తప్పవు. కోహ్లి అద్భుతమైన ఫామ్, గిల్ జోరుకు తోడు రోహిత్ తనదైన శైలిలో చెలరేగితే టీమ్‌కు ఎదురుండదు. ముగ్గురు పేసర్లతో భారత్ బరిలోకి దిగనుంది. రెండో స్పిన్నర్‌గా చహల్, కుల్దీప్ మధ్య పోటీ ఉంది. వన్డే టీమ్‌లోకి ఎంపికైనా... ఆంధ్ర కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్‌కు అప్పుడే అవకాశం లభించకపోవచ్చు.
విలియమ్సన్ లేకుండా...
న్యూజిలాండ్ జట్టులో ఒక్కో ఆటగాడిని చూస్తే పెద్ద ఘనతలు కనిపించవు. కానీ జట్టుగా మాత్రం సమష్టితత్వంతో ఎంతటి కఠిన ప్రత్యర్థిపైనైనా పైచేయి సాధించగలదు. పాకిస్తాన్‌లో వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న జట్టు భారత్‌కు చేరుకుంది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు విలియమ్సన్, సౌతీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో టీమ్‌లో అనుభవం తక్కువగా కనిపిస్తోంది.
ఎక్కువ భాగం ఆటగాళ్లు భారత గడ్డపై ఎప్పుడూ ఆడనివారే. స్పిన్‌ను సమర్థంగా ఆడగల కెప్టెన్ టామ్ లాథమ్‌పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. అయితే స్పిన్నర్ ఇష్ సోధి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడం జట్టును కొంత బలహీనపర్చింది. ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్‌వెల్ తమ పేస్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టగలరు.
పిచ్, వాతావరణం
హైదరాబాద్ మొదటి నుంచి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ప్రధాన బ్యాటర్లంతా ప్రతీసారి పరుగులు సాధించారు. అయితే పేస్‌తో పోలిస్తే స్పిన్ బౌలింగ్ కాస్త ఎక్కువ ప్రభావం చూపించగలదు. మ్యాచ్ రోజు నగరంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్, సుందర్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, ఉమ్రాన్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్‌మన్, మిచెల్, ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, డౌగ్ బ్రేస్‌వెల్.
55 ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం 113 వన్డేలు జరిగాయి. ఇందులో భారత్ 55 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 50 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా... ఏడు మ్యాచ్‌లు రద్దయ్యాయి.
చదవండి: IND VS NZ 1st ODI: కోహ్లికి డిమోషన్.. కింగ్ స్థానంలో గిల్..?
Comments
Please login to add a commentAdd a comment