Asia Cup 2023- Pakistan batters' runs might dry up in Sri Lanka: పాకిస్తాన్ బ్యాటర్లకు టీమిండియా సీమర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీకాదని భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ అన్నాడు. శ్రీలంక పిచ్‌లపై టీమిండియా పేస్ దళం అద్భుతంగా రాణించగలదని పేర్కొన్నాడు. అదే విధంగా.. ఆసియా కప్-2023లో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్‌లో చేసిన స్కోరు కాపాడుకోగలిగిందే అని అభిప్రాయపడ్డాడు.
చెలరేగిన పాక్ పేస్ త్రయం
ఈసారి వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా టోర్నీలో భారత జట్టు సెప్టెంబరు 2న తమ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోటీపడింది. పల్లెకెలెలో జరిగిన దాయాదుల పోరులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో పాక్ పేస్ త్రయం షాహిన్ ఆఫ్రిది ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. అతడికి తోడుగా నసీం షా, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లతో రాణించారు. దీంతో.. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి టీమిండియా ఆలౌట్ అయింది.
వాళ్లిద్దరి అద్భుత ఇన్నింగ్స్.. అయితే వర్షం వల్ల
మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా(87) బ్యాట్ ఝులిపించడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. అయితే, భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం ఉధృతం కావడంతో పాక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ రద్దైపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
మా వాళ్లు తోపులు అని గొప్పలు
ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో పసికూన నేపాల్‌పై భారీ విజయాలతో సూపర్-4లో అడుగుపెట్టిన పాక్, భారత్.. ఆదివారం మరోసారి పరస్పరం ఢీకొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఫ్యాన్స్ తమ పేస్ దళం గురించి గొప్పలు చెప్పుకొంటూ సోషల్ మీడియాలో అతి చేస్తున్నారు.
పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించగలరు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ మాదిరే టీమిండియా పేస్ దళం కూడా పటిష్టమైంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ రూపంలో మంచి పేసర్లు ఉన్నారు.
ఆరోజు గెలవగలిగే స్థితిలోనే
ఎలా పోల్చినా పాక్- టీమిండియా సీమర్ల నైపుణ్యాల మధ్య పెద్దగా తేడా ఏమీలేదు’’ అని బంగర్ పేర్కొన్నాడు. ఇక పల్లెకెలె మ్యాచ్ గురించి చర్చరాగా.. ‘‘ఆ పిచ్‌పై 260- 270 మెరుగైన స్కోరే. టీమిండియా మంచి స్కోరే చేసింది. ఒకవేళ పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి ఉంటే.. కచ్చితంగా భారత పేసర్ల నుంచి వారికి సవాలు ఎదురయ్యేది. ఎందుకంటే ఆ వికెట్ అలా ఉంది మరి!’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: Ind vs Pak: ప్రాక్టీస్‌లో టీమిండియా.. శ్రేయస్ అయ్యర్ ‘గెలుపు’! కానీ..
Comments
Please login to add a commentAdd a comment