సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించడం ద్వారా సౌతాఫ్రికాలో పింక్ వన్డే (సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలతో ఆడే మ్యాచ్‌లు) గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ భారత కెప్టెన్ సౌతాఫ్రికాలో పింక్ వన్డే గెలవలేదు.
అసలేంటీ పింక్ వన్డే..
రొమ్ము క్యాన్సర్ పై అవగాహన, ఫండ్ రైజింగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) ప్రతి ఏటా వన్డే క్రికెట్ మ్యాచ్‌లను పింక్ కలర్ జెర్సీల్లో ప్లాన్ చేస్తుంది. ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పింక్ కలర్ జెర్సీలు ధరిస్తారు. సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలు ధరించి ఆడే మ్యాచ్‌ను పింక్‌డే వన్డే అని పిలుస్తుంటారు. ఈ మ్యాచ్ ద్వారా లభించే మొత్తంలో కొంత భాగాన్ని సీఏ రొమ్ము క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు చేస్తుంది.
పింక్ వన్డే తొలిసారి 2013లో జరిగింది. నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 34 పరుగుల తేడాతో మట్టికరిపించింది. నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 పింక్ వన్డేలు జరగగా.. సౌతాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన పింక్ వన్డేలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో) నమోదు చేశాడు. పింక్ వన్డేల్లో పాకిస్తాన్ (2019), ఇంగ్లండ్ (2020), భారత్ (2023) మాత్రమే సౌతాఫ్రికాను ఓడించాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment