భారత జట్టు
India vs South Africa, 1st T20I: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆరంభం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో లేకపోవడం తీరని లోటు అని.. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనకు పరాజయం తప్పదని జోస్యం చెప్పాడు. ఎయిడెన్ మార్కరమ్, క్వింటన్ డికాక్ చేరికతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా కనిపిస్తోందని.. మొదటి టీ20లో బవుమా బృందం విజయం సాధిస్తుందని అంచనా వేశాడు.
కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేరళలోని తిరువనంతపురం వేదికగా బుధవారం(సెప్టెంబరు 28) భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు.. పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.
అతడు లేని భారత జట్టు బలహీనం!
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేసే క్రమంలో.. ‘‘చివరిసారి దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడికి వచ్చినపుడు ఎయిడెన్ మార్కరమ్ లేడు. డికాక్ కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అందుకే అప్పుడు ప్రొటిస్ కాస్త బలహీనంగా కనిపించింది. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ జట్టులో ఉన్నారు.
డెత్ ఓవర్లలోనూ..
ఇక టీమిండియా విషాయనికొస్తే హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జట్టు కాస్త బలహీనపడిందని చెప్పొచ్చు. నాకు తెలిసి ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుంది. ఈ సిరీస్‌కు పాండ్యా అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే.. డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇక భువనేశ్వర్ కుమార్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.
అయితే, ఈ సిరీస్‌కు అతడు దూరంగా ఉన్నాడు. కానీ తర్వాత అతడు ఎలా ఆడతాడన్నది చూడాలి. నాకైతే భువీ విషయంలో నమ్మకం కాస్త సడలింది. ఇక గాయం నుంచి కోలుకున్న ఆటగాడు సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది. హర్షల్ పటేల్ విషయంలోనూ అదే జరుగుతోంది.
ఆసీస్‌తో మూడో టీ20లో ఫైనల్ ఓవర్ అతడు బౌల్ చేసిన విధానం చూస్తే ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఏదేమైనా డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ అంశం కలవరపెడుతోందన్నది వాస్తవం’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
మూడోసారి!
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో టీమిండియాకు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్. జనవరిలో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. జూన్‌లో ఆ జట్టు ఇక్కడికి వచ్చింది. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది.
చదవండి: Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్! ఇతర వివరాలు
Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే!
Comments
Please login to add a commentAdd a comment