Ind vs SA: నిరాశలో కోహ్లి.. వెన్నుతట్టి అభినందించిన రోహిత్‌ | IND Vs SA 1st Test: Rohit Sharma Appreciates And Pats Virat Kohli After His Valiant 76; Watch Video - Sakshi
Sakshi News home page

Ind vs SA: నిరాశలో కోహ్లి.. వెన్నుతట్టి అభినందించిన రోహిత్‌

Published Fri, Dec 29 2023 6:22 PM | Last Updated on Fri, Dec 29 2023 7:04 PM

Ind vs SA 1st Test Rohit Appreciates Pats Kohli After his Valiant 76 Watch - Sakshi

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో రాణించిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభినందించాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి.. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచని తీరును ప్రశంసించాడు. జట్టు భారీ ఓటమి నేపథ్యంలో దిగులుగా పెవిలియన్‌కు చేరుకున్న కోహ్లిని.. ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా వెన్నుతట్టి ప్రోత్సహించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ‘విరాహిత్‌’ ద్వయం అభిమానులను ఆకట్టుకుంటోంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న టీమిండియా కల ఈసారికి చెదిరిపోయిన విషయం తెలిసిందే. బాక్సింగ్‌ డే టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన ఆతిథ్య జట్టు .. టీమిండియాను ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 

అయితే, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి ఆచితూచి ఆడినందు వల్లే భారత జట్టు ఈమాత్రం పరువు దక్కించుకోగలిగింది. లేదంటే మరింత భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకునేది. గురువారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌క 5 పరుగులకే వెనుదిరిగాడు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌(26)కు తోడైన కోహ్లి ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. క్రమక్రమంగా వేగం పెంచుతూ అరవై ఒక్క బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్నాడు. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. 

గిల్‌ తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(6), కేఎల్‌ రాహుల్‌(4), అశ్విన్‌(0), శార్దూల్‌ ఠాకూర్‌(2), జస్‌ప్రీత్‌ బుమ్రా(0), మహ్మద్‌ సిరాజ్‌(4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో కోహ్లి ఒక్కడే కాస్త నిలకడగా ఆడుతూ 76 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

మరో ఎండ్‌లో ఉన్న ప్రసిద్‌ కృష్ణ స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ సాయం అందిస్తున్న తరుణంలో.. 34.1వ ఓవర్‌ వద్ద మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ డెలివరీని గాల్లోకి లేపిన కోహ్లి.. రబడకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. పదో వికెట్‌గా కోహ్లి వెనుదిరగడంతో భారత జట్టు ఓటమి ఖరారైంది.

ఈ క్రమంలో నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్న కోహ్లిని అభినందిస్తూ రోహిత్‌ అతడి భుజం తట్టాడు. ఈ దృశ్యాలు నెట్టింట సందడి చేస్తుండగా.. ఆటలో గెలుపోటములు సహజం అని సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలం అంటూ టీమిండియా ఫ్యాన్స్‌ నిట్టూరుస్తున్నారు. కాగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య జనవరి 3 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement