రాహుల్‌ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్‌ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్‌గా.. | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్‌ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్‌గా..

Published Thu, Jan 4 2024 3:53 PM

Ind vs SA 2nd Test Day 2: Bumrah Cant Belive Rahul Dropped Markram Sitter - Sakshi

Ind vs SA 2nd Test- Fastest Test hundreds for South Africaసౌతాఫ్రికా- టీమిండియా మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు.. కేప్‌టౌన్‌లో తొలి రోజే ఏకంగా 23 వికెట్లు.. భారత పేసర్ల ధాటికి తొలుత 55 పరుగులకే ఆలౌట్‌ అయిన సౌతాఫ్రికా... ఆ తర్వాత టీమిండియా 153 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగించి 36 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా బుధవారం నాటి మొదటి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. అప్పటికి ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 51 బంతులు ఎదుర్కొని 36 పరుగులు, ఐదో నంబర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ ఆరు బంతులు ఆడి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్లలో మహ్మద్‌ సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు దక్కించుకోగా.. జస్ప్రీత్‌ బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్లు రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్‌ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మళ్లీ బౌలింగ్‌కు దిగిన టీమిండియా పేసర్లలో ముకేశ్‌ కుమార్‌ రెండు, బుమ్రా ఒక వికెట్‌ తీశారు.

తద్వారా పేసర్లకు న్యూలాండ్స్‌ పిచ్‌ స్వర్గధామం అన్న విషయం మరోసారి నిరూపితమైంది. తొలి రోజే బ్యాటర్లుకు చుక్కలు చూపిస్తూ ఏకంగా 23 వికెట్ల ప్రదర్శనకు వేదికైన ఇలాంటి అత్యంత కఠినమైన పిచ్‌పై సెంచరీని ఊహించగలమా!? అది కూడా అత్యంత వేగవంతమైన శతకం!!

రెండో రోజు ఆట సందర్భంగా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సౌతాఫ్రికా ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌. గురువారం 63/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మొదలుపెట్టిన ప్రొటిస్‌ జట్టు.. బుమ్రా ధాటికి వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మార్క్రమ్‌ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.

రాహుల్‌ జారవిడిచిన క్యాచ్‌ వల్ల సెంచరీ
భారత పేసర్లకు కొరకరాని కొయ్యగా మారిన అతడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో.. బుమ్రా బౌలిం‍గ్‌లో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో లైఫ్‌ పొందాడు. ఈ క్రమంలో 99 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకుని మార్క్రమ్‌ చరిత్రకెక్కాడు.

కేప్‌టౌన్‌ గడ్డపై తొలి సఫారీ బ్యాటర్‌గా మార్క్రమ్‌ రికార్డు
సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం బాదిన ఆరో బ్యాటర్‌గా మార్క్రమ్‌ నిలిచాడు. అదే విధంగా కేప్‌టౌన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్రొటిస్‌ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా సెంచరీలు చేసింది వీరే
►ఏబీ డివిలియర్స్‌(75 బంతుల్లో)- ఇండియా మీద- 2010 సెంచూరియన్‌ మ్యాచ్‌లో..
►హషీం ఆమ్లా(87 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 2012 పెర్త్‌ మ్యాచ్‌లో..
►డెనిస్‌ లిండ్సే(95 బంతుల్లో)- ఆస్ట్రేలియా మీద- 1966 జొహన్నస్‌బర్గ్‌ మ్యాచ్‌లో 
►జాంటీ రోడ్స్‌(95 బంతుల్లో)- వెస్టిండీస్‌ మీద- 1999 సెంచూరియన్‌ మ్యాచ్‌లో
►షాన్‌ పొలాక్‌(95 బంతుల్లో)- శ్రీలంక మీద- 2001 సెంచూరియన్‌ మ్యాచ్‌లో
►ఐడెన్‌ మార్క్రమ్‌(99 బంతుల్లో)- ఇండియా మీద- 2024 కేప్‌టౌన్‌ మ్యాచ్‌లో..

ఇక మార్క్రమ్‌ 106 పరుగుల స్కోరు వద్ద ఉన్న సమయంలో సిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరువాత కగిసో రబడ(2), లుంగి ఎంగిడి(8) అవుట్‌ కావడంతో సౌతాఫ్రికా 176 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ ముగించి 78 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 79 పరుగులు చేయాలి. రెండో రోజు ఆటలో బుమ్రా ఆరు వికెట్లు దక్కించుకోవడం విశేషం.

Advertisement
Advertisement