కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ (1/93), శార్దూల్ ఠాకూర్ (1/101) స్థానంలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. ప్రసిద్ద్ (0,0), శార్దూల్ (24, 2) తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయారు. దీంతో మేనేజ్‌మెంట్ ఈ ఇద్దరిని తప్పించి ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఇప్పటికే నెట్స్‌లో సాధన చేయడం కూడా మొదలుపెట్టారు. రెండో టెస్ట్ కోసం టీమిండియా ఆదివారం కేప్‌టౌన్‌కు బయల్దేరనుంది. రేపటి నుంచి భారత్ అక్కడే ప్రాక్టీస్ చేయనుంది. సిరీస్ కాపాడుకోవాలంటే రెండో టెస్ట్ తప్పక గెలవాల్సి ఉండటంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు చాలా కీలకంగా మారింది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని పట్టుదలగా ఉంది.
కాగా, మొహమ్మద్ షమీ గైర్హాజరీలో ఆవేశ్ ఖాన్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఆవేశ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆవేశ్ ఖాన్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒక్కడే ఒంటరిపారాటం చేశాడు.
టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment