
Ind Vs Sa: మాకు అశ్విన్ ఉన్నాడు.. జడేజాను మిస్సవడం లేదు: కోహ్లి
Virat Kohli Comments Ahead 3rd Test Against South Africa: సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలన్న టీమిండియా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడాలంటే కోహ్లి ఆఖరి టెస్టులో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కేప్‌టౌన్‌లో జరిగే ఆఖరి టెస్టులో దక్షిణాఫ్రికాను ఓడిస్తేనే టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, అక్కడి పిచ్ తమకే అనుకూలిస్తుందంటూ ప్రొటిస్ జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ ఇప్పటికే భారత బ్యాటర్లకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘పేస్’ మా డియరెస్ట్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో ముచ్చటించిన టీమిండియా సారథి విరాట్ కోహ్లి తమకు అత్యుత్తమ పేసర్లు ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను పగ్గాలు చేపట్టినపుడు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాం. గత నాలుగేళ్లలో నెంబర్ వన్ జట్టుగా ఎదిగాం. విజయాలకు నేను బాట వేశాను. ప్రతిరోజూ సరికొత్త వ్యూహాలతో..
ప్రతి మ్యాచ్‌కు వేర్వేరు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. మాకు మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. ఎవరిని ఆడించాలన్న విషయమే మాకొక తలనొప్పి. నిజంగా ఇది మాకు గర్వకారణమనే చెప్పాలి. టెస్టుల్లో మా పేసర్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. కాగా జనవరి 11 నుంచి టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక ఆఖరి టెస్టు జరుగనుంది.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు: కోహ్లి ప్రెస్ మీట్ హైలెట్స్:
►మహ్మద్ సిరాజ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశం గురించి చర్చిస్తున్నాం.
►మాకు అశ్విన్ ఉన్నాడు కదా. జడేజాను అస్సలు మిస్సవడం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అశ్విన్ అద్భుతంగా రాణించగలడు.
►మిడిలార్డర్‌లో వైఫల్యం నిజమే. జట్టులో మార్పులు చేయాల్సిందే. కానీ బలవంతంగా ఎవరినీ తప్పించకూడదు. పుజారా, రహానే రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. గతంలో కూడా ఎన్నోసార్లు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడారు.
►నా ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. విమర్శలను నేను పట్టించుకోను. కొత్తగా నేను నిరూపించుకోవాల్సింది ఏమీలేదు. నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాను.
►ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. పంత్ కూడా అంతే. అయితే, తన తప్పులను సరిదిద్దుకుని పంత్ మెరుగ్గా రాణించగలడు.
చదవండి: Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు..మాతోనే ‘ఆట’లా..!
Virat Kohli: రాహుల్ కెప్టెన్సీపై కోహ్లి వ్యాఖ్యలు... నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీలేదు!