న్యూఢిల్లీ: భారత గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరింది. టి20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను చేజార్చుకోరాదని పట్టుదలగా ఉండగా... స్టార్లు లేకపోయినా సిరీస్ గెలవగల సత్తా తమలో ఉందని భారత బృందం నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో సఫారీ టీమ్‌తో టీమిండియా తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఇరు జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే మరో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే వాన కారణంగా పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి.
మార్పుల్లేకుండానే...
రెండో వన్డేలో భారత జట్టు ఆటను చూస్తే ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఆశించిన ఫలితం దక్కినట్లే అనిపిస్తోంది. భారత్ కోణంలో యువ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించడమే ఈ సిరీస్‌లో కీలకం కాగా అందరూ ఆశించిన స్థాయిలో రాణించారు. బ్యాటింగ్‌లో శ్రేయస్, సామ్సన్, ఇషాన్ కిషన్ సత్తా చాటగా, ఆల్‌రౌండర్‌గా శార్దుల్, బౌలింగ్‌లో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. షహబాజ్ కూడా అరంగేట్రంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనే కనబర్చాడు.
పేసర్లలో సిరాజ్ పదునైన బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. తన తాజా ప్రదర్శనతో అతను టి20 వరల్డ్ కప్ జట్టులో బుమ్రా స్థానంలో చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. వీరిద్దరు జట్టుకు శుభారంభం అందిస్తే తిరుగుండదు. ముఖ్యంగా వచ్చే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శిఖర్ సొంతగడ్డపై గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడటం అవసరం. మొత్తంగా రెండో వన్డే విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో భారత యువ జట్టు మరో గెలుపుపై దృష్టి పెట్టింది.
బవుమా రాణించేనా!
భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య కెప్టెన్ బవుమా బ్యాటింగ్. నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 0, 0, 3, 8 పరుగులు చేసిన బవుమా వరల్డ్‌కప్‌కు ముందు ఆఖరి పోరులోనైనా రాణించాలని జట్టు కోరుకుంటోంది. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన అతను ఇక్కడ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. డికాక్ శుభారంభం అందించాల్సి ఉండగా, ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్ కూడా మరో కీలక ఇన్నింగ్స్‌పై గురి పెట్టాడు.
బవుమా తిరిగొస్తే మలాన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం ఖాయం కాబట్టి హెన్‌డ్రిక్స్‌పై అదనపు భారం ఉంది. టూర్ మొత్తం మంచి ప్రదర్శన ఇచ్చిన మిల్లర్ అదే జోరు కొనసాగిస్తే సఫారీ టీమ్ సిరీస్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అయితే రబడ, నోర్జే తమ స్థాయిలో గొప్ప బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆల్‌రౌండర్‌గా పార్నెల్ కూడా తమ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. కేశవ్ మహరాజ్ ఆకట్టుకోవడంతో మరోసారి రెండో స్పిన్నర్ లేకుండానే జట్టు బరిలోకి దిగనుంది. ఇలాంటి స్థితిలో పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ముగించగలదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment