రుతురాజ్‌ స్థానంలో ఎంట్రీ.. అరంగేట్రంలో ఇలా! అదే హైలైట్‌ | Ind vs SA 3rd ODI: Rajat Patidar Impresses With Short Cameo On Debut | Sakshi
Sakshi News home page

Ind vs SA: రుతురాజ్‌ స్థానంలో ఎంట్రీ.. అరంగేట్రంలో పాటిదార్‌ ఇలా! అదే హైలైట్‌.. కానీ

Published Thu, Dec 21 2023 6:56 PM | Last Updated on Thu, Dec 21 2023 7:24 PM

Ind vs SA 3rd ODI: Rajat Patidar Impresses With Short Cameo On Debut - Sakshi

One for future: Rajat Patidar Cameo: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు భారత బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ వేలికి గాయం కావడంతో అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

వచ్చీ రాగానే మెరుగైన ఇన్నింగ్స్‌తో తన మార్కు చూపించాడు. కాగా పర్ల్‌ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్‌ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 

ఉన్నది కాసేపే అయినా
ఈ క్రమంలో రజత్‌ పాటిదార్‌.. సాయి సుదర్శన్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని 22 పరుగులు సాధించాడు. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన పాటిదార్‌.. రెండో ఓవర్‌ రెండో బంతికే బౌండరీ బాదాడు. అదే ఓవర్లో ఐదో బాల్‌కు మరో ఫోర్‌తో అలరించాడు. 

ఇక ఐదో ఓవర్‌ మొదటి బంతికి అద్భుత రీతిలో పాటిదార్‌ సిక్స్‌ బాదడం హైలైట్‌గా నిలిచింది. అయితే అదే ఓవర్లో మూడో బంతికి మరో బౌండరీ బాదిన రజత్‌ పాటిదార్‌.. ఆ మరుసటి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. ప్రొటిస్‌ పేసర్‌ నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో బిగ్‌ షాట్‌కు యత్నించి వికెట్‌ సమర్పించుకున్నాడు.

అరంగేట్రంలో మొత్తంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు సాధించి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో మెరుగైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడంటూ రజత్‌ పాటిదార్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లలో కూడా రజత్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు.

30 ఏళ్ల వయసులో అరంగేట్రం
మధ్యప్రదేశ్‌కు చెందిన రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌. దేశవాళీ క్రికెట్‌లో గత ఎనిమిదేళ్లుగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా యాభై ఓవర్ల క్రికెట్‌లో పాటిదార్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్‌- ఏ క్రికెట్‌లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు.

టీ20లలోనూ అతడికి మెరుగైన రికార్డు ఉంది. మధ్యప్రదేశ్‌ తరఫున 148.55 స్ట్రైక్‌రేటుతో 1640 పరుగులు సాధించాడు. ఇక పొట్టి క్రికెట్‌లో అదరగొడుతున్న పాటిదార్‌ను ఐపీఎల్‌ వేలం-2021 సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కొనుగోలు చేసింది. 

ఇప్పటి వరకు మొత్తంగా ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన రజత్‌ పాటిదార్‌ 404 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన పాటిదార్‌.. ఐపీఎల్‌2024లో సత్తా చాటి టీ20 ప్రపంచకప్‌-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement