టీమిండియాతో సిరీస్‌.. సౌతాఫ్రికాదే గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్‌ వైరల్‌ | Ind vs SA: Herschelle Gibbs Bold Statement Predicts South Africa As Series Winner | Sakshi
Sakshi News home page

టీమిండియాతో సిరీస్‌.. 3-1తో సౌతాఫ్రికా గెలుపు: సిక్సర్ల వీరుడి కామెంట్స్‌ వైరల్‌

Published Wed, Nov 13 2024 1:49 PM | Last Updated on Wed, Nov 13 2024 3:42 PM

Ind vs SA: Herschelle Gibbs Bold Statement Predicts South Africa As Series Winner

టీ20 సిరీస్‌లో చెరో విజయంతో సమంగా ఉన్న టీమిండియా- సౌతాఫ్రికా మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్‌ వేదికగా మూడో టీ20 జరుగనుంది. ఇందులో గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని ఇటు సూర్య సేన.. అటు ప్రొటిస్‌ జట్టు తహతహలాడుతున్నాయి.

మొదటి రెండు టీ20లలో అలా
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ హర్షల్‌ గిబ్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు టీ20లలో పిచ్‌లు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీ20 మ్యాచ్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. అయితే, టీమిండియాపై తమ జట్టు పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

టీమిండియాతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుందని హర్షల్‌ గిబ్స్‌ విశ్వాసం కనబరిచాడు. ఇందుకు గల కారణాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. నాకు తెలిసి ఇప్పటి వరకు వికెట్‌ టీమిండియాకే అనుకూలించింది. అయితే, సెంచూరియన్‌, జొహన్నస్‌బర్గ్‌ మ్యాచ్‌లలో మాత్రం భారీస్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నా.

3-1తో ప్రొటిస్‌ జట్టుదే సిరీస్‌
ఆ రెండు మ్యాచ్‌లలో ఏదైనా జరగొచ్చు. తొలి రెండు టీ20లలో ప్రొటిస్‌ పూర్తిస్థాయి, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగింది. అయితే, టీమిండియా మాత్రం అనుభవలేమి ఆటగాళ్లతో ఇక్కడికి వచ్చింది. నా అంచనా ప్రకారం ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటిస్‌ జట్టు సొంతం చేసుకుంటుంది’’ అని హర్షల్‌ గిబ్స్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌బూమ్‌తో వ్యాఖ్యలు చేశాడు.

మిగిలిన రెండు టీ20లలో
కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డర్బన్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, గెబెహాలో జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తదుపరి సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో బుధవారం మూడో టీ20... అదే విధంగా.. శుక్రవారం జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్‌ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగునున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 నిమిషాలకు మొదలయ్యేలా షెడ్యూల్‌ ఖరారైంది.

ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకుని
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా హర్షల్‌ గిబ్స్‌ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. 2007లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.

ఇక గిబ్స్‌ తర్వాత వన్డేల్లో జస్కరన్‌ మల్హోత్రా  (అమెరికా) పాపువా న్యూగినియాతో 2021 నాటి మ్యాచ్‌లో మళ్లీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌; 2007లో) బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. తర్వాత వెస్టిండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌  శ్రీలంక బౌలర్‌ అఖిల  ధనంజయ(2021లో) బౌలింగ్‌లో  ఈ ఘనత సాధించాడు.

సౌతాఫ్రికాతో టీ20లకు భారత జట్టు
సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్‌ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్, జితేశ్ శర్మ, విజయ్‌కుమార్‌ వైశాఖ్, రమణ్‌దీప్‌ సింగ్, యశ్ దయాళ్.

సౌతాఫ్రికా జట్టు
రియాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆండిలే సిమెలేన్, గెరాల్డ్‌ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, నకబయోమ్జీ పీటర్, పాట్రిక్ క్రూగర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, డోనోవన్ ఫెరీరా, ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, లుథో సిపామ్లా.

చదవండి: BGT: బీసీసీఐ కీలక నిర్ణయం!.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement