భారత క్రికెట్ జట్టు
India Vs South Africa T20 Series 2022: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వెస్టిండీస్ టూర్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన ఈ యువ పేసర్.. మెగా టోర్నీలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ముఖ్యంగా పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో క్యాచ్ నేలపాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న అర్ష్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన అర్ష్‌దీప్
తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బంతిని స్వింగ్ చేస్తూ.. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా ప్రొటిస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
అర్ష్‌దీప్ సింగ్
మరో జహీర్ ఖాన్
ఇక అదే జోష్‌లో మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అర్ష్‌దీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలర్. నా అభిప్రాయం ప్రకారం టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు.
అర్ష్‌దీప్ సింగ్ పేస్‌లో వైవిధ్యం.. బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం అతడిని ప్రత్యేకంగా నిలిపాయి. మానసికంగా కూడా తను ఎంతో బలవంతుడు. తన శక్తిసామర్థ్యాలేమిటో అతడికి బాగా తెలుసు. వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా పూర్తి అవగాహన ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీలీ రొసోవ్, డికాక్‌ను అవుట్ చేసిన తీరు బాగుంది.
నువ్వు సూపర్
అయితే, డేవిడ్ మిల్లర్ వికెట్ మాత్రం అద్భుతం. ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు. ఇంత చిన్న వయసులోనే అర్ష్‌దీప్ రాణిస్తున్న తీరు అమోఘం. టీమిండియాకు జహీర్ ఖాన్ లాంటి లెఫ్టార్మ్ పేసర్ సేవలు అవసరమైన తరుణంలో అతడు వచ్చాడు’’ అంటూ 23 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్‌పై కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సైతం అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్... 17 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు
National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment