యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత్- ప్రొటిస్ జట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. జైత్రయాత్రను కొనసాగించాలని టీమిండియా.. పరాభవాల నుంచి కోలుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తొలి టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి ప్రశ్న ఎదురైంది. అతడిని సౌతాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని విలేఖరులు అడుగగా.. ‘‘రుతు అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు.
అతడి కంటే ముందు చాలా మందే ఉన్నారు
ఇక అతడి కంటే ముందు చాలా మంది ఆటగాళ్లు కూడా ఇలాగే అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆడించాలో మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. యాజమాన్యం నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. రుతు ఇంకా యువకుడే. అతడికీ ఏదో ఒక రోజు టైమ్ వస్తుంది’’ అని సూర్య కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానమిచ్చాడు.
కొత్త జోడీ
కాగా రుతురాజ్ గైక్వాడ్ వన్డే, టీ20 ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్థానమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముఖ్యంగా టీ20లలో యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్ జోడీ ఓపెనర్లుగా పాతుకుపోగా.. వారి గైర్హాజరీలో కొత్తగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ జోడీని బీసీసీఐ పరిశీలిస్తోంది.
కెప్టెన్‌గా అవకాశాలు
అయితే, సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందే భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు ప్రొటిస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ రుతు చివరగా జింబాబ్వే పర్యటనలో టీమిండియా తరఫున టీ20 సిరీస్ ఆడాడు. ఆ టూర్‌లో 158కి పైగా స్ట్రైక్‌రేటుతో 133 పరుగులు సాధించాడు.
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆసీస్ గడ్డపై విఫలం
అంతేకాదు.. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా జట్టుకు సారథ్యం వహించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న రుతు.. అక్కడ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు.
తొలి టెస్టులో 0, 5 పరుగులు చేసిన రుతు.. రెండో టెస్టులో 4, 11 రన్స్ చేశాడు. ఇక తొలి టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఓడిన భారత్-ఎ.. రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది.
చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment