2024లో టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. యశస్వి ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు దాటిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 13 మ్యాచ్‌ల్లోనే యశస్వి ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఆ సిరీస్‌లో 79.91 సగటున 712 పరుగులు చేశాడు. అనంతరం జింబాబ్వే టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 165.88 స్ట్రయిక్‌రేట్‌తో 141 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 70 పరుగులు చేసి (40, 30) ఆకట్టుకున్నాడు.
యశస్వి ఈ ఏడాది రెండు డబుల్ సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1023 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి తర్వాతి స్థానంలో లంక ఆటగాడు కుశాల్ మెండిస్ ఉన్నారు. మెండిస్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 888 పరుగులు చేశాడు. మెండిస్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇబ్రహం జద్రాన్ (844), టీమిండియా రోహిత శర్మ (833), శ్రీలంక పథుమ్ నిస్సంక (791), ఆఫ్ఘనిస్తాన్ రహ్మానుల్లా గుర్భాజ్ (773), టీమిండియా శుభ్‌మన్ గిల్ (725) ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారిలో ఉన్నారు.
లంకతో రెండో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుశాల్ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
అనంతరం భారత్ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలు కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment