భారత్‌తో టి20 సిరీస్ ఆడేందుకు వస్తున్న జట్లకు గట్టి దెబ్బే తగులుతోంది. ఈ సీజన్‌లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల తర్వాత పరాజిత జట్ల జాబితాలో ఇప్పుడు శ్రీలంక చేరింది. టీమిండియా సొంతగడ్డపై అన్నీ గెలిచి వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది.
ధర్మశాల: అసలు సీనియర్లే లేని పేస్ దళంతో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థిని ఆరంభంలోనే మూడు చెరువుల నీటిని తాగించింది. అవేశ్ ఖాన్ (2/23), సిరాజ్ (1/22), హర్షల్ (1/29)ల దెబ్బకు... శ్రేయస్ అయ్యర్ (45 బంతుల్లో 73 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ కూడా తోడవడంతో ఆఖరి టి20లో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మొదట లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. కెప్టెన్ షనక (38 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూలిపోతున్న లంకను ఒంటిచేత్తో నిలబెట్టాడు. తర్వాత వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
షనక పోరాటం
లంక 11 మందితో బరిలోకి దిగితే పోరాడింది మాత్రం కెప్టెన్ ఒక్కడే! గత మ్యాచ్‌లో జట్టు భారాన్నీ మోసిన షనక ఇందులో అయితే జట్టు పాలిట ఆపద్భాంధవుడయ్యాడు. అవేశ్‌ఖాన్ ఆరంభ స్పెల్‌కు (3–1–4–2) కుదేలై... లంక 11 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. 60 స్కోరు వద్ద ఐదో వికెట్ కూలింది. ఈ దశలో మరో వికెట్ పడకుండా చమిక కరుణరత్నే (12 నాటౌట్)తో కలిసి షనక విరోచిత ప్రదర్శన చేశాడు. ఇద్దరు 7.5 ఓవర్లపాటు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. అవేశ్ మిగిలిపోయిన ఓవర్‌ను 2 ఫోర్లు, సిక్సర్‌తో చితగ్గొట్టాడు. 3 ఓవర్లేసి 4 పరుగులే ఇచ్చిన అవేశ్ తన ఆఖరి ఓవర్లో ఏకంగా 19 పరుగులిచ్చాడు. 29 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న షనక ఆఖరి ఓవర్లలో చెలరేగిపోయాడు.
అయ్యర్ సూపర్
సామ్సన్‌తో కలిసి లక్ష్యఛేదనకు దిగిన రోహిత్ బౌండరీతో ఖాతా తెరిచాడు. తొలి ఓవర్లోనే అతను అవుటవ్వాల్సింది కానీ మిడాఫ్‌లో షనక క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయాడు. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని రోహిత్ (5) మరుసటి ఓవర్లోనే కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చీరాగానే లంక బౌలర్ల భరతం పట్టాడు. 6.1 ఓవర్లో భారత్ స్కోరు ఫిఫ్టీకి చేరింది. సామ్సన్ (18) పెద్ద స్కోరేమీ చేయలేదు. తర్వాత దీపక్ హుడా (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ జట్టును నడిపించాడు. అయ్యర్ 29 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ భారత్ 100 పరుగులకు చేరకముందే హుడా అవుటయ్యాడు. తర్వాత వెంకటేశ్ (5) విఫలమయ్యాడు. జడేజా (22 నాటౌట్; 3 ఫోర్లు) వచ్చాకా ఇంకో వికెట్ పడకుండా శ్రేయస్ మ్యాచ్‌ను ముగించేశాడు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) అవేశ్ ఖాన్ 1; గుణతిలక (బి) సిరాజ్ 0; అసలంక (సి) సామ్సన్ (బి) అవేశ్ ఖాన్ 4; లియనాగె (బి) రవి బిష్ణోయ్ 9; చండిమాల్ (సి) వెంకటేశ్ (బి) హర్షల్ 22; షనక (నాటౌట్) 74; కరుణరత్నే (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1–1, 2–5, 3–11, 4–29, 5–60.
బౌలింగ్: సిరాజ్ 4–0–22–1, అవేశ్ ఖాన్ 4–1–23–2, హర్షల్ పటేల్ 4–0–29–1, కుల్దీప్ 4–0–22–0, రవి బిష్ణోయ్ 4–0–32–1.
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) చండిమాల్ (బి) కరుణరత్నే 18; రోహిత్ (సి) కరుణరత్నే (బి) చమీర 5; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 73; దీపక్ హుడా (బి) కుమార 21; వెంకటేశ్ (సి) సబ్–జయవిక్రమ (బి) కుమార 5; జడేజా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.5 ఓవర్లలో 4 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–6, 2–51, 3–89, 4–103.
బౌలింగ్: ఫెర్నాండో 4–0–35–0, చమీర 3–0–19–1, లహిరు కుమార 3.5–0–39–2, కరుణరత్నే 3.4–0–31–1, వాండెర్సే 2.2–0–24–0.
IND vs SL: టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
Published Mon, Feb 28 2022 5:22 AM | Last Updated on Mon, Feb 28 2022 12:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment