పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో విండీస్ జట్టుపై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ కంగారు పెట్టించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.
గర్జించిన భారత్ బ్యాట్స్‌మెన్
సీనియర్లు లేని భారత టాపార్డర్ వెస్టిండీస్ బౌలింగ్‌పై గర్జించింది. ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోగా... శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీశారు.
ఓపెనర్ల శుభారంభం
ధావన్, గిల్ జోడీ ఓపెనింగ్‌లో అదరగొట్టింది. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు చేశారు. దీంతో తొలి 3 ఓవర్లయితే టి20ని తలపించింది. ఈ ధాటి కొనసాగడంతో 6.5 ఓవర్లలో భారత్ స్కోరు 50కి చేరింది. చూడచక్కని షాట్లతో గిల్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో 14 ఓవర్ల దాకా 7పైచిలుకు రన్‌రేట్‌తో భారత్ 100/0 స్కోరు చేసింది. తర్వాత 18వ ఓవర్లో ధావన్ 53 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేయగా, గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ధావన్ సెంచరీ మిస్
అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో రెండో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగడంతో కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సెంచరీపై కన్నేసిన ధావన్... గుడకేశ్ మోతీ 34వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కానీ తర్వాతి బంతికే అతను పెవిలియన్ చేరడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్, సూర్యకుమార్ (13) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. సంజూ సామ్సన్ (12) కూడా విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 48వ ఓవర్లో అక్షర్ పటేల్ (21; ఫోర్, సిక్స్) 6, 4 కొట్టగా, దీపక్ హుడా (27; ఫోర్, సిక్స్) 6 బాదడంతో ఏకంగా 20 పరుగులొచ్చాయి. అల్జారీ జోసెఫ్ 49వ ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చగా, ఆఖరి ఓవర్లో భారత్ 300 మార్క్‌ను దాటింది.
Comments
Please login to add a commentAdd a comment