India Vs West Indies 4th T20- Rohit Sharma- Avesh Khan: టీమిండియా యువ బౌలర్ ఆవేశ్ ఖాన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. ఏ ఆటగాడైనా సరే ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం సహజమేనని.. అయితే అతడి ప్రతిభ గురించి తెలుసు కాబట్టే మరో అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్- భారత జట్ల మధ్య శనివారం(ఆగష్టు 6) నాలుగో టీ20 జరిగిన విషయం తెలిసిందే.
అదరగొట్టిన పంత్, అక్షర్..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(33), సూర్యకుమార్ యాదవ్(24) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా 21 పరుగులు చేశాడు.
ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 44 పరుగులతో రాణించాడు. సంజూ శాంసన్ 30(నాటౌట్), దినేశ్ కార్తిక్(6), అక్షర్ పటేల్20 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రోహిత్ సేన 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ఆవేశ్ దెబ్బ!
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు పూరన్ బృందానికి టీమిండియా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్‌ను 13 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరో యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం కదం తొక్కాడు. మూడు వికెట్లతో రాణించాడు.
బౌలర్లంతా..
అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ కైలీ మేయర్స్, రోవ్‌మన్ పావెల్ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం రెండు వికెట్లు తీశాడు. ఇలా టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 19.1 ఓవర్లలో 132 పరుగులకే విండీస్ కుప్పకూలింది. దీంతో 59 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
సమిష్టి కృషి వల్లే..
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ జట్టు సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. తమ బ్యాటర్లు, బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరిచారని ప్రశంసించాడు. ‘‘పిచ్ మరీ అంత అనుకూలంగా ఏమీ లేదు. బ్యాటింగ్ ఎలా చేయాలో ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.
నిజానికి 190 అనేది మంచి స్కోరే! కానీ.. విండీస్ బ్యాటింగ్ లైనప్ దృష్ట్యా దీనిని మెరుగైన స్కోరుగా భావించలేం. ఏదేమైనా ఈరోజు మ్యా బ్యాటర్లు స్మార్ట్‌గా ఆడారు. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటారు.
వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. పిచ్ కాస్త స్లో గానే ఉంది. మా బౌలర్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు’’ అని రోహిత్ శర్మ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు.
ఇక ఆవేశ్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వడం గురించి... ‘‘ఆవేశ్ ప్రతిభ గురించి మాకు తెలుసు. ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో సరిగ్గా ఆడలేకపోవచ్చు. అయితే, తన నైపుణ్యం గురించి తెలుసు కాబట్టే అవకాశం ఇచ్చాము. అందుకు తగ్గట్టుగా పరిస్థితులను అర్థం చేసుకుని చక్కగా బౌలింగ్ చేశాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
అప్పుడు దారుణంగా విఫలం.. ఇప్పుడు హీరోగా!
కాగా విండీస్‌తో రెండో టీ20లో ఆవేశ్ ఖాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 2.2 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఆవేశ్ చేతికి బంతినివ్వగా.. డెవాన్ థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాది విండీస్‌ను గెలిపించాడు. దీంతో ఆవేశ్‌పై విమర్శల జడి కురిసింది.
ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ మూడు ఓవర్లు బౌలింగ్ వేసి ఏకంగా 47 పరుగులు ఇచ్చాడు. అయినప్పటికీ యాజమాన్యం.. ఆవేశ్‌ను నమ్మి నాలుగో టీ20లో అవకాశం ఇవ్వగా అతడు దీనిని సద్వినియోగం చేసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు.
చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు'
Comments
Please login to add a commentAdd a comment