West Indies vs India, 4th T20I: వెస్టిండీస్‌తో నాలుగో టీ20 నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ భారీ రికార్డుపై కన్నేశాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యంత అరుదైన ఫీట్ ముంగిట నిలిచాడు. కాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. అదే ఏడాది జింబాబ్వేతో మ్యాచ్‌తో టీ20లలో అడుగుపెట్టాడు.
హరారే స్పోర్ట్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన చహల్.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియా కీలక స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేయగలిగాడు.
ఊరిస్తున్న భారీ రికార్డు
టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న ఈ హర్యానా బౌలర్.. పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్న యజువేంద్ర చహల్‌ను భారీ రికార్డు ఊరిస్తోంది.
సెంచరీ వికెట్ల క్లబ్‌లో చేరేందుకు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చహల్ ఇప్పటి వరకు 95 వికెట్లు పడగొట్టాడు. మరో ఐదు వికెట్లు సాధిస్తే.. సెంచరీ వికెట్ల క్లబ్‌లో అతడు చేరతాడు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టీమిండియా బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు.
పిచ్ సంగతి అలా.. మరి చహల్ ఎలా?
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా శనివారం నాటి నాలుగో మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. అయితే, బ్యాటర్లకు స్వర్గధామమైన, పేసర్లకు కాస్త అనుకూలమైన ఫ్లోరిడా పిచ్‌పై చహల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి! ఇక విండీస్‌తో మూడు మ్యాచ్‌లలో కలిపి చహల్ ఇప్పటి వరకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. భారత్, విండీస్ మధ్య ఈ మైదానంలో 6 టి20లు జరగ్గా, భారత్ నాలుగింటిలో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గత రెండు మ్యాచ్‌లలో భారత్ 191, 188 స్కోర్లు చేసింది.
ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లలో 100కు పైగా వికెట్లు సాధించిన బౌలర్లు వీరే
షకీబల్ హసన్- బంగ్లాదేశ్-140
టిమ్ సౌథీ- న్యూజిలాండ్- 134
రషీద్ ఖాన్- అఫ్గనిస్తాన్- 130
ఇష్ సోధి- న్యూజిలాండ్-118
లసిత్ మలింగ- శ్రీలంక- 107
షాదాబ్ ఖాన్- పాకిస్తాన్- 104
ముస్తాఫిజుర్ రహమాన్- బంగ్లాదేశ్- 103.
చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment