Ind Vs Wi 3Rd Odi, Dj Bravo Shares 'Kieron Pollard Missing' Report, See Pollard Reaction - Sakshi
Sakshi News home page

Ind Vs Wi- Kieron Pollard: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్‌ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి లేదంటే..’.. అవునా?

Published Fri, Feb 11 2022 12:03 PM | Last Updated on Fri, Feb 11 2022 12:43 PM

Ind Vs Wi: Dwayne Bravo Shares Missing Report Of Kieron Pollard His Reaction - Sakshi

Ind Vs Wi ODI Series- Kieron Pollard- Dwayne Bravo : టీమిండియాతో వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచ్‌లలోనూ ఓడి సిరీస్‌ను భారత జట్టుకు సమర్పించుకుంది. ముఖ్యంగా విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఫామ్‌లేమి, గాయం జట్టును కలవరపెడుతోంది. మొదటి వన్డేలో అతడు వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. టీమిండియా బౌలర్‌ యజువేంద్ర చహల్‌ సంధించిన మొదటి బంతికే పొలార్డ్‌ వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. 

ఇక రెండో వన్డేలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన విండీస్‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే, పొలార్డ్‌ గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. ఏ మేరకు రాణిస్తాడన్నది వేచిచూడాల్సిందే. అతడు బ్యాట్‌ ఝులిపిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పొలార్డ్‌ సహచర ఆటగాడు, విండీస్‌ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావో సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ఇది నిజంగా విచారకర దినం. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ పొలార్డ్‌ తప్పిపోయాడు. ఒకవేళ మీకు ఏదైనా సమాచారం అందితే దయచేసి నాకు తెలియజేయండి. లేదంటే పోలీసులకు రిపోర్టు చేయండి’’ అంటూ ఏడుపు, నవ్వులు కలగలిసిన ఎమోజీలను జతచేశాడు. 

అంతేగాక.. ‘‘వయసు 34, ఎత్తు 1.85 మీటర్లు, చివరగా చహల్‌ పాకెట్‌లో చూశాం. కనిపిస్తే వెస్టిండీస్‌ను కాంటాక్ట్‌ చేయండి’’ అని పొలార్డ్‌ ఫొటోను షేర్‌ చేశాడు. ఇందుకు పొలార్డ్‌ సైతం సరదాగా స్పందించాడు. ‘‘అవునా బ్రావో.. నేను మిస్సయ్యానా.. ఎప్పుడు ఎలా?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చాడు. కాగా ఇటీవల స్వదేశంలో ఐర్లాండ్‌ చేతిలో ఓడి విండీస్‌ వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. భారత పర్యటనలో ఇదే తరహాలో చేదు అనుభవం మూటగట్టుకుంది.

చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement