IND Vs WI 2022 T20I: Fans Slams India And Rohit Sharma For Playing Suryakumar Yadav As Opener - Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: ఇదే కొనసాగితే సూర్య కెరీర్‌ నాశనమవడం ఖాయం! తగ్గేదేలే అంటున్న రోహిత్‌!

Published Tue, Aug 2 2022 12:40 PM | Last Updated on Tue, Aug 2 2022 1:17 PM

Ind Vs WI: Fans Slams Team India Suryakumar Not Opener Dont Spoil Career - Sakshi

రోహిత్‌ శర్మ- సూర్యకుమార్‌ యాదవ్‌(PC: BCCI)

India Vs West Indies T20 Series- Suryakumar Yadav: ఇంగ్లండ్‌ పర్యటనలో తనదైన ఆట తీరుతో అభిమానుల మనసు కొల్లగొట్టాడు టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగో స్థానంలో బరిలోకి దిగి వరుసగా 39(19 బంతుల్లో), 15(11 బంతుల్లో), 117(55 బంతుల్లో) పరుగులు నమోదు చేశాడు. 

ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. సూర్య మాత్రం తన తొలి సెంచరీ నమోదు చేసి ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకున్నాడు. అంతేకాదు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ఐదో ర్యాంకు సాధించాడు. అయితే, వెస్టిండీస్‌ టూర్‌లో సీన్‌ మారిపోయింది.

పూర్తిగా నిరాశపరిచాడు!
విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఇప్పటి వరకు టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌లలో సూర్యను ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దించారు. కానీ, ఈ రెండు సందర్భాల్లోనూ అతడు పూర్తిగా విఫలమయ్యాడు. రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ తొలి టీ20లో 16 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేశాడు.

అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో జేసన్‌ హోల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక రెండో టీ20లో 6 బంతుల్లో 11 పరుగులు చేసి ఒబెడ్‌ మెకాయ్‌ బంతికి దొరికిపోయాడు. విండీస్‌ వికెట్‌ కీపర్‌ డెవాన్‌ థామస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇదే కొనసాగితే కెరీర్‌ నాశనం!
దీంతో టీమిండియా అభిమానులు సూర్యను ఓపెనర్‌గా పంపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ‘‘అతడు ఓపెనర్‌ కాదు. ఆ విషయం మీకూ తెలుసు. కానీ ఎందుకిలా చేస్తున్నారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా ఆడేవాడు. ఇప్పుడు మాత్రం వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నాడు. 

ఇదంతా చూస్తుంటే సూర్య కెరీర్‌ను నాశనం చేసేందుకే మేనేజ్‌మెంట్‌ ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరు ఏ స్థానంలో మెరుగ్గా ఆడగలరో మీకు తెలియదా? తెలిసీ ఎందుకిలా చేస్తున్నారు’’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది సూర్య ఓపెనర్‌గా పనికిరాడు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఏదేమైనా తగ్గేదేలే: రోహిత్‌ శర్మ
ఇదిలా ఉంటే.. రెండో టీ20లో ఓటమి తర్వాత కూడా తాము ప్రయోగాలకు వెనుకాడబోమని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక టాస్‌ సమయంలోనూ.. రోహిత్‌ మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బ్యాటర్‌ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము.

ఏ ఒక్కరిపైనో ఆధారపడాలని మేము భావించడం లేదు. అందుకే ఇలా మార్పులు చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సమీపిస్తున్న తరుణంలో అన్ని విధాలా సన్నద్ధం కావడానికే ఈ ప్రయోగాలు అని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ అభిమానులు.. ‘‘ఇది ఇలాగే కొనసాగితే సూర్య కెరీర్‌ ముగిసిపోవడానికి ఎంతో కాలం పట్టదు. దయచేసి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అతడి స్థానం మార్చండి ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పంత్‌ ప్లేస్‌లో సూర్య.. సూర్య ప్లేస్‌లో పంత్‌!
ఇక భారత మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సైతం.. ‘‘అతడి(సూర్య)ని ఓపెనర్‌గా పంపొద్దు. విఫలమవుతున్నాడు. ఇదే కొనసాగితే ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. ఇది అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు రిషభ్‌ పంత్‌ను ఓపెనర్‌గా పంపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం విండీస్‌ పర్యటనలో పంత్‌.. సూర్య ప్లేస్‌లో అంటే నాలుగో స్థానంలో ఆడుతుండగా.. సూర్య.. రోహిత్‌కు జోడీగా ఓపెనర్‌గా రావడం గమనార్హం. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్‌ సేన.. విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. కాగా వెస్టిండీస్‌- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2)న మూడో టీ20 జరుగనుంది.

చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్‌ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే!
Obed Mccoy: విండీస్‌ బౌలర్‌ సంచలనం.. టి20 క్రికెట్‌లో ఐదో బౌలర్‌గా
Ind Vs WI T20 Series: మొన్న పంత్‌.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement