‘గులాబీ’ గుచ్చుకుంది.. | India at 233 for 6 against Australia at stumps in Adelaide day-night test | Sakshi
Sakshi News home page

‘గులాబీ’ గుచ్చుకుంది..

Published Fri, Dec 18 2020 3:30 AM | Last Updated on Fri, Dec 18 2020 4:56 AM

India at 233 for 6 against Australia at stumps in Adelaide day-night test - Sakshi

పింక్‌ పోరులో టీమిండియా తడబడింది... ఓపెనర్ల వైఫల్యం తర్వాత సీనియర్ల ఆటతో దారిలో పడిన ఇన్నింగ్స్‌... సూర్యాస్తమయానికి ముందు మళ్లీ గతి తప్పింది... ఫలితంగా అడిలైడ్‌లో తొలి రోజు ఆట చివరకు ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. కోహ్లి అర్ధ సెంచరీకి తోడు పుజారా, రహానేల ప్రదర్శన టీమిండియాను ఆదుకుంది. మిగిలిన నాలుగు వికెట్లతో మన జట్టు మరికొన్ని అదనపు పరుగులు జోడిస్తే రెండో రోజు
భారత బౌలర్లు శాసించవచ్చు.   


అడిలైడ్‌:  ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బాధ్యతాయుత బ్యాటింగ్, చతేశ్వర్‌ పుజారా అడ్డుగోడ, అజింక్యా రహానే నిలకడ వెరసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది. గురువారం టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. స్టార్క్‌ 2 వికెట్లు తీయగా... హాజల్‌వుడ్, కమిన్స్, లయన్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది. వృద్ధిమాన్‌ సాహా (9 బ్యాటింగ్‌), అశ్విన్‌ (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ఓపెనింగ్‌ బౌల్డ్‌
ఆట ఆరంభం కాగానే భారత ఓపెనింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా(0)ను స్టార్క్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే బౌల్డ్‌ చేశాడు. అతని స్టాన్స్, బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య అతని నిర్లక్ష్యంపై టీవీ వ్యాఖ్యాతల్లో ఒకరైన పాంటింగ్‌ స్పందించాడు. అతని టెక్నిక్‌లో లోపాలున్నాయని... తేలిగ్గానే క్లీన్‌బౌల్డ్‌  చేయొచ్చని వ్యాఖ్యానించాడు. రికీ కామెంట్‌ ముగిసిందో లేదో అన్నట్లుగానే అతని వికెట్‌ పడింది. ఐపీఎల్‌లో పృథ్వీ ఉన్న ఢిల్లీ జట్టుకు పాంటింగ్‌ కోచ్, మెంటార్‌గా వ్యవహరించాడు. అలా పరుగు రాకమునుపే భారత్‌ వికెట్‌ను సమర్పించుకుంది. తర్వాత కాసేపటికే మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (40 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో 32 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. కొత్త బంతి మెరుగును ఆసీస్‌ పేసర్లు అందిపుచ్చుకున్నారు.  

రహానేను అవుట్‌ చేసిన క్షణాన స్టార్క్‌...

పుజారా నిలబడి...
భారత్‌కు ఇది రెండో డేనైట్‌ టెస్టు. విదేశాల్లో మొదటిది. పరిస్థితులకు అనుగుణంగా పుజారా ఆడకపోయివుంటే భారత్‌ తొలి రోజే ఆలౌటయ్యేది. సంప్రదాయ క్రికెట్‌ ఆడే అర్హతలన్నీ పుష్కలంగా వున్న పుజారా ముఖ్యంగా పింక్‌ టెస్టును ఎలా ఆడాలో తన ఆటతీరుతో చాటిచెప్పాడు. మొదట్లో బ్యాట్స్‌మెన్‌కు ఎదురయ్యే ప్రతికూలతలకు ఎదురీదాడు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవించాడు. అతను బౌండరీ బాదేందుకు పట్టిన బంతుల్ని చూస్తే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. వంద బంతులాడినా ఫోర్‌ కొట్టని పుజారా 147వ బంతిని బౌండరీకి తరలించాడు. మరుసటి బంతిని అక్కడికే పంపాడు. కెప్టెన్‌ కోహ్లి క్రీజులో ఉండటం, అతను బాధ్యతగా ఆడటం వల్ల తొలి సెషన్‌లో మరో వికెట్‌ తీయడం ఆసీస్‌ తరం కాలేకపోయింది.  

కోహ్లి అర్ధసెంచరీ
కెప్టెన్‌ కోహ్లి, పుజారా ఆడిన తీరు తొలిసెషన్‌ నష్టాన్ని పూడ్చింది. రెండో సెషన్‌ను కూడా దాదాపు కాపాడింది. అందుకే జట్టు స్కోరు 100 పరుగుల దాకా మరో వికెట్‌ కోల్పోకుండా వీరి భాగస్వామ్యం సాగింది. ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌ అందుబాటులో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించాడు. ఆఖరి సెషన్‌కు కాస్త ముందు... ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌ వేసిన లయన్‌ పుజారాను ఔట్‌ చేశాడు. నిజానికి పుజారాకు ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇవ్వలేదు. బ్యాట్, ప్యాడ్‌లను తాకుతూ వెళ్లిన బంతి ని లెగ్‌ గల్లీలో ఉన్న లబ్‌షేన్‌ అందుకున్నాడు. పెద్దగా అప్పీల్‌ చేసినా అంపైర్‌ నాటౌట్‌ అన్నాడు. కానీ ఈ లోపే పుజారా ప్చ్‌... అని నిట్టూరుస్తూ నిష్క్రమించేందుకు సిద్ధమయ్యాడు.

అంపైర్‌ నిర్ణయంతో మళ్లీ నిలబడ్డాడు. దీన్ని గమనించిన ఆసీస్‌ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లి ఫలితం పొందారు.దీంతో 68 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. రహానే జతయ్యాక 107/3 స్కోరు వద్ద టీ విరామానికెళ్లారు. తర్వాత వీళ్లిద్దరు కూడా కుదురుకోవడంతో ఆసీస్‌ బౌలర్లకు మళ్లీ అలసట తప్పలేదు. ముఖ్యంగా కోహ్లి పోరాటం తొలిరోజు ఆటకు ప్రాణం పోసింది. 123 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో భారత కెప్టెన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో సెషన్‌లో కొత్త బంతి భారత్‌ను దెబ్బ తీసింది. తొలి ఓవర్లోనే స్టార్క్‌ క్రీజులో పాతుకుపోయిన రహానేను ఎల్బీడబ్ల్యూగా పంపించాడు. రహానే రివ్యూ కోరినా లాభం లేకపోయింది. కాసేపటికే హనుమ విహారి (16)ని హాజల్‌వుడ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.  

అవుటా..నాటౌటా!
కోహ్లిని 16 పరుగుల వద్ద అవుట్‌ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా వృథా చేసుకుంది. లయన్‌ బౌలింగ్‌లో కోహ్లి లెగ్‌సైడ్‌ ఆడగా బంతి కీపర్‌ పైన్‌ చేతుల్లో పడింది. క్యాచ్‌ అప్పీల్‌కు అంపైర్‌ స్పందించలేదు. రివ్యూ కోరేందుకు పైన్‌ ఆసక్తి చూపించినా...లయన్‌ సహా సహచరులెవరూ మద్దతు ఇవ్వలేదు. దాంతో పైన్‌ రివ్యూకు వెళ్లలేదు. అయితే రీప్లేలో అది అవుటయ్యే అవకాశం ఉందని తేలింది. హాట్‌స్పాట్‌లో బంతి కోహ్లి గ్లవ్‌ను అలా తాకుతూ వెళ్లటం నమోదైంది. పూర్తి స్పష్టత లేకపోయినా డీఆర్‌ఎస్‌ను వాడుకుంటే ఆసీస్‌కు మేలు జరిగేది. సరైందా, కాదా తర్వాతి సంగతి... మూడు రివ్యూలు అందుబాటులో ఉండగా, కోహ్లి కోసం దానిని వాడకపోవడం పైన్‌ నాయకత్వ వైఫల్యాన్ని చూపిస్తోంది.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) స్టార్క్‌ 0; మయాంక్‌ (బి) కమిన్స్‌ 17; పుజారా (సి) లబ్‌షేన్‌ (బి) లయన్‌ 43; కోహ్లి రనౌట్‌ 74; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్‌ 42; విహారి (ఎల్బీడబ్ల్యూ) (బి) హజల్‌వుడ్‌ 16; సాహా బ్యాటింగ్‌ 9; అశ్విన్‌ బ్యాటింగ్‌ 15; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (89 ఓవర్లలో 6 వికెట్లకు) 233.
వికెట్ల పతనం: 1–0, 2–32, 3–100, 4–188, 5–196, 6–206. బౌలింగ్‌: స్టార్క్‌ 19–4–49–2; హజల్‌వుడ్‌ 20–6–47–1, కమిన్స్‌ 19–7–42–1, గ్రీన్‌ 9–2–15–0, లయన్‌ 21–2–68–1, లబ్‌షేన్‌ 1–0–3–0.

తొలి సెషన్‌
ఓవర్లు: 25, పరుగులు: 41, వికెట్లు: 2
రెండో సెషన్‌
ఓవర్లు: 30, పరుగులు: 66, వికెట్లు: 1
మూడో సెషన్‌
ఓవర్లు: 34, పరుగులు: 126, వికెట్లు: 3

అదే మలుపు...

కోహ్లి, రహానే మధ్య 88 పరుగుల భాగస్వామ్యం అనూహ్యంగా రనౌట్‌తో ముగిసింది. లయన్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ వైపు ఆడిన రహానే పరుగు కోసం కాస్త ముందుకు వచ్చాడు. మరో వైపునుంచి కోహ్లి మాత్రం వేగంగా దూసుకుపోయాడు. బంతి ఫీల్డర్‌ వద్దకు చేరడంతో పరిస్థితి చూసిన రహానే వెనక్కి తగ్గినా... కోహ్లి అప్పటికే చాలా ముందుకు వచ్చేశాడు. దాంతో లయన్‌ సునాయాసంగా రనౌట్‌ చేసేశాడు.  


ఒక దశలో మేం ప్రత్యర్థిపై ఆధిపత్యంలో ఉన్నామనేది వాస్తవం. అయితే కోహ్లి, రహానే అవుట్‌ కావడంతో వారిది కాస్త పైచేయిగా మారింది. ఈ రెండూ ఎంతో కీలకమైన వికెట్లు. అయినా సరే మ్యాచ్‌లో ప్రస్తుతం ఇరు జట్ల పరిస్థితి సమానంగానే ఉందనేది నా అభిప్రాయం. సాహా, అశ్విన్‌లు బ్యాటింగ్‌ చేయగలరు కాబట్టి కనీసం 300 పరుగుల స్కోరు రావచ్చు. లోయర్‌ ఆర్డర్‌ కూడా చెలరేగితే 350 కూడా కావచ్చేమో ఎవరు చెప్పగలరు! ఆరంభంలో పరుగులు రాకపోవడం, బాగా నెమ్మదిగా ఆడాల్సి రావడంలో తప్పేమీ లేదు. బంతి బాగా స్వింగ్‌ అవుతున్న ఆ సమయంలో వేగంగా పరుగులు రాబట్టాలనే వ్యూహం గురించి ఎవరూ ఆలోచించరు. చేతిలో వికెట్లు ఉంటే ఆ తర్వాత ఎలాగైనా పరుగులు సాధించవచ్చు. బౌలర్లకు ఈ రోజు పిచ్‌ బాగా అనుకూలించింది. వారిని గౌరవిస్తూ ఆడటం ఎంతో ముఖ్యం. రెండు సెషన్లలోనే వికెట్లు కోల్పోతే తొలి రోజే ఆలౌట్‌ అయ్యే ప్రమాదం ఉండేది కదా’

–చతేశ్వర్‌ పుజారా, భారత బ్యాట్స్‌మన్‌   

ఇంకా ఎన్ని పరుగులు?
మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 250/9... ఈ స్కోరు కాస్త తేడాగా కనిపిస్తోందా! రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇదే అడిలైడ్‌ మైదానంలో మొదటి రోజు టీమిండియా సాధించిన స్కోరు ఇది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించగా... చివరకు టెస్టును 31 పరుగులతో గెలిచిన కోహ్లి సేన సిరీస్‌లో శుభారంభం చేసింది. నాటి ప్రదర్శనలు సరిగ్గా పునరావృతం కాకపోవచ్చు కానీ ఆ మ్యాచ్‌ ప్రదర్శనతో పోల్చి చూస్తే నేటి 233/6 మెరుగైన స్కోరుగానే చెప్పవచ్చు. విదేశీ గడ్డపై తొలి ‘పింక్‌ బాల్‌’ టెస్టు ఆడుతున్న భారత్‌ పూర్తిగా కుప్పకూలిపోకుండా ఇక్కడి వరకు రాగలిగింది. ఆరంభంలో పుజారా కనబర్చిన పట్టుదలను ఎంత ప్రశంసించినా తక్కువే. గత సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడిని నిరోధించడం ఎంత కష్టమో ఆసీస్‌కు ఈపాటికే అర్థమై ఉంటుంది. ముగ్గురు పేసర్లు చక్కటి క్రమశిక్షణతో, అద్భుతమైన బంతులతో పుజారాను ఎంతగా ఇబ్బంది పెట్టినా అతను సహనం కోల్పోలేదు. ఏకాగ్రత చెదరకుండా సుమారు మూడున్నర గంటల పాటు క్రీజ్‌లో నిలిచి వికెట్‌ విలువేమిటో చూపించాడు. ఆ పునాదిపైనే కోహ్లి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. మరి కొద్దిసేపు కోహ్లి ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. రహానే కూడా ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. అయితే కోహ్లి రనౌట్‌కు కారణమైన అపరాధ భావం వల్ల కావచ్చు రహానే వెంటనే తడబడ్డాడు.

డే అండ్‌ నైట్‌ టెస్టుకు సంబంధించి సాయంత్రం సమయంలో కొత్త గులాబీ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బంది కావచ్చంటూ చర్చ సాగగా, ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. రహానే, విహారి అదే సమయంలో వికెట్ల ముందు దొరికిపోయారు. అయితే మరికొంత పట్టుదల కనబరిస్తే ఆ గండం దాటవచ్చని సాహా, అశ్విన్‌ 43 బంతులు ఆడి నిరూపించారు. వీరిద్దరికి బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. ఇటీవల అశ్విన్‌ బ్యాటింగ్‌ కూడా ఎంతో మెరుగైంది. రెండో రోజు వీరు నిలబడితే భారత్‌ కనీసం 275–300 మధ్య స్కోరు సాధించగలదు. సాధారణంగా పింక్‌ టెస్టుల్లో బౌలర్లు ఆధిపత్యం సాగిస్తున్న చోట పరుగుల వరద పారకపోయినా ఇది చెప్పుకోదగ్గ స్కోరు. అడిలైడ్‌ పిచ్‌ కూడా కాస్త భిన్నంగా కనిపిస్తోంది. కొంత బౌన్స్‌ ఉన్నా వేగం కూడా మరీ ఎక్కువేమీ లేదు. చాలా బంతులు బ్యాట్‌ను తాకి స్లిప్స్‌లో ఫీల్డర్ల ముందు పడ్డాయి.
బుమ్రా, షమీ రూపంలో అత్యుత్తమ బౌలర్లు మన జట్టులో ఉన్నారు. పైగా ఆఫ్‌స్టంప్‌పై కచ్చితత్వంతో బౌలింగ్‌ చేస్తూ కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఆశించే ఆసీస్‌ పేసర్లతో పోలిస్తే నేరుగా స్టంప్స్‌పైనే ఎక్కువగా దాడి చేసే మన బౌలర్ల శైలికి ఈ పిచ్‌ సరిగ్గా సరిపోతుంది. అడిలైడ్‌లో నాలుగు డే అండ్‌ నైట్‌ టెస్టులు గెలిచిన రికార్డు ఉన్నా... నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ప్రతీసారి తడబడ్డారనే విషయం గమనార్హం. ఇక లయన్‌ బంతిని తిప్పిన తీరు చూస్తుంటే సీనియర్‌ స్పిన్నర్‌‡ అశ్విన్‌ను ఎదుర్కోవడం ఆసీస్‌కు అంత సులువు కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement