
కొత్త స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ పోరు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గ్వాలియర్‌లో కొత్త స్టేడియాన్ని ముస్తాబు చేసింది. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టి20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఈ కొత్త మైదానంలో నిర్వహించనుంది. షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 6న తొలి టి20 ధర్మశాలలో జరగాలి. కానీ అక్కడ నవీకరణ పనులు మ్యాచ్ సమయానికల్లా పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో బోర్డు వేదికను మార్చింది.
గ్వాలియర్ నగరంలో కొత్తగా నిర్మించిన ‘శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం’లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. వచ్చే జనవరిలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై, కోల్‌కతాల్లో జరగాల్సిన మ్యాచ్ వేదికల్ని పరస్పరం మార్చారు. జనవరి 22న చెన్నైలో జరగాల్సిన మొదటి టి20 కోల్‌కతాలో, 25న కోల్‌కతాలో జరగాల్సిన మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహిస్తారు.