ముక్కోణపు టోర్నీ రద్దుతో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణ
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్‌లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది.
ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్‌ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్‌కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లంతా 5న కోల్‌కతాలో కలుసుకుంటారు. హెడ్‌కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్‌కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment