ఫిట్‌నెస్, ఫామ్ చాటుకున్న గిల్
రాణించిన నితీశ్ రెడ్డి, జైస్వాల్
పీఎం ఎలెవన్‌పై టీమిండియా గెలుపు
కాన్‌బెర్రా: భారత్, ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్ల మధ్య రెండు రోజుల డే–నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ‘వన్డే’కు పరిమితమైంది. వరుణుడు కరుణించడంతో భారత బ్యాటర్లు ‘పింక్ బాల్’తో ఆ కాస్త ప్రాక్టీస్‌కు నోచుకున్నారు. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆటంతా రద్దవగా... రెండోరోజు వన్డేలా నిర్వహించారు. ఒక్కో జట్టుకు 46 ఓవర్లు కేటాయించారు. జట్టులోని 11 మందికి బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం కల్పించారు.
భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్‌లో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పీఎం టీమ్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్ (97 బంతుల్లో 107; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో అలరించాడు. హనో జాకబ్స్ (60 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాక్ క్లేటన్ (52 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించారు. హర్షిత్ రాణా (4/44) నిప్పులు చెరగడంతో ఒక దశలో పీఎం జట్టు 138 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. అయితే కొన్‌స్టాస్, జాకబ్స్ ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించడంతో పీఎం జట్టు 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది.
భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సుందర్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారత జట్టు మొత్తం 46 ఓవర్లు ఆడి 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు సాధించింది. టీమిండియా 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడింది. టాపార్డర్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 50 రిటైర్డ్ నాటౌట్; 7 ఫోర్లు) ఫిట్‌నెస్, ఫామ్ చాటుకోగా... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (59 బంతుల్లో 45; 9 ఫోర్లు), ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (36
బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment