రాజ్‌కోట్: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–2తో సమం చేసింది. శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. అవేశ్ ఖాన్ (4/18) కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, చహల్‌కు 2 వికెట్లు దక్కాయి. సిరీస్‌లోని చివరిదైన ఐదో టి20 మ్యాచ్ రేపు బెంగళూరులో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యం...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఇన్‌గిడి తన తొలి ఓవర్లోనే రుతురాజ్ (5)ను వెనక్కి పంపగా, తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న జాన్సెన్ చక్కటి బంతితో శ్రేయస్ అయ్యర్ (4)ను అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 40 పరుగులకు చేరింది. అయితే నోర్జే తన తొలి బంతికే కిషన్‌ను అవుట్ చేయగా, క్రీజ్‌లో ఉన్నంత సేపు రిషభ్ పంత్ (23 బంతుల్లో 17; 2 ఫోర్లు) బాగా ఇబ్బంది పడ్డాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కూడా రన్‌రేట్ కనీసం 6 పరుగులు దాటకుండా 62/3 వద్ద స్కోరు నిలిచింది! ఈ దశలో షమ్సీ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో హార్దిక్ ధాటిని పెంచాడు.
అయితే కార్తీక్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆటను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. నోర్జే ఓవర్లో రెండు ఫోర్ల తర్వాత మహరాజ్ ఓవర్లో 3 బౌండరీలు కొట్టిన అతను... ప్రిటోరియస్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం (33 బంతుల్లో) అనంతరం షమ్సీ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ వెనుదిరగ్గా, 26 బంతుల్లో కార్తీక్ అర్ధ సెంచరీ పూర్తయింది. పదహారేళ్ల అంతర్జాతీయ టి20 కెరీర్‌లో కార్తీక్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. చివరి 5 ఓవర్లలో భారత్ 73 పరుగులు చేసింది.
టపటపా...
ఛేదనలో దక్షిణాఫ్రికా పూర్తిగా తడబడింది. ఏ దశలోనూ ఆ జట్టుకు మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనిపించలేదు. గాయంతో బవుమా (8 రిటైర్డ్‌హర్ట్) తప్పుకోగా, డికాక్ (14) అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రిటోరియస్ (0) విఫలం కాగా, ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు బలంగా నిలిచిన ముగ్గురు బ్యాటర్లు క్లాసెన్ (8), మిల్లర్ (9), వాన్ డర్ డసెన్ (20) తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో 14 ఓవర్లోనే ఆ జట్టు గెలుపు ఆశలు దాదాపుగా కోల్పోయింది. అవేశ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం. తర్వాత వచ్చినవారిలో ఎవరూ ప్రభావం చూపలేకపోవడంతో సఫారీ ఓటమి ఖాయమైంది.
Clinical win for #TeamIndia in Rajkot! 👏 👏
— BCCI (@BCCI) June 17, 2022
The @RishabhPant17-led unit beat South Africa by 82 runs to level the series 2-2. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/fyNIlEOJWl
Comments
Please login to add a commentAdd a comment