హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని టీమిండియా కొత్త ఏడాదిని విజయంతో మొదలు పెట్టింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైనా చివరకు ఉత్కంఠను అధిగమించి దానిని కాపాడుకోగలిగింది. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సిన లంక సింగిల్ మాత్రమే తీయడంతో గెలుపు టీమిండియా పరమైంది. బ్యాటింగ్‌లో దీపక్ హుడా ఆదుకోగా, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శివమ్ మావి ఓవర్‌కు ఒక్కో వికెట్ చొప్పున నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ముంబై: శ్రీలంకతో టి20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి 1–0తో ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ హుడా (23 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షనక (27 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, శివమ్ మావి (4/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో టి20 రేపు పుణేలో జరుగుతుంది.
కీలక భాగస్వామ్యం...
రజిత వేసిన తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టగా, మొత్తం 17 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లంక బౌలర్లు చక్కటి బంతులతో భారత్‌ను కట్టిపడేశారు. అరంగేట్ర మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ (7) విఫలం కాగా, సూర్యకుమార్ (7), సంజు సామ్సన్ (5) విఫలమయ్యారు. పవర్‌ప్లేలో జట్టు 41 పరుగులకే పరిమితమైంది.
మరోవైపు రజిత ఓవర్లోనే వరుస బంతుల్లో 6, 4 కొట్టిన కిషన్ మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. 11–15 ఓవర్ల మధ్య 26 పరుగులే చేయగలిగిన భారత్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్ కూడా చేజార్చుకుంది. అయితే చివర్లో హుడా దూకుడు టీమిండియాకు మెరుగైన స్కోరు అందించింది. తీక్షణ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన హుడా... హసరంగ, రజిత ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. మదుషంక ఓవర్లో అక్షర్ కూడా సిక్స్, ఫోర్‌తో తన వంతు సహకారం అందించాడు. హుడా, అక్షర్ ఆరో వికెట్‌కు అభేద్యంగా 35 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు.
షనక మినహా...
తన తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే వికెట్‌తో మావి ఆకట్టుకున్నాడు. నిసాంక (1)ను బౌల్డ్ చేసిన అతను, తన తర్వాతి ఓవర్లో ధనంజయ (8)ను వెనక్కి పంపాడు. మొదటి 6 ఓవర్లలో లంక 32 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయిన లంక సగం ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులకే పరిమితమైంది. అయితే కెప్టెన్ షనక, హసరంగ దూకుడుతో జట్టు కొంత పోరాడగలిగింది. చహల్ ఓవర్లో హసరంగ వరుసగా రెండు సిక్సర్లు బాదగా, హర్షల్ ఓవర్లో షనక 6, 4 కొట్టాడు. అయితే 21 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో షనకను ఉమ్రాన్ అవుట్ చేయడంతో లంక గెలుపు ఆశలు కోల్పోయింది.
మావి, గిల్ అరంగేట్రం
తొలి టి20 ద్వారా భారత్ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అర్‡్షదీప్ అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో పేసర్ శివమ్ మావి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌తో శుబ్‌మన్ గిల్ కూడా అంతర్జాతీయ టి20ల్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికే 13 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గిల్‌కు ఇదే తొలి టి20 మ్యాచ్.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) ధనంజయ (బి) హసరంగ 37; గిల్ (ఎల్బీ) (బి) తీక్షణ 7; సూర్యకుమార్ (సి) రాజపక్స (బి) కరుణరత్నే 7; సామ్సన్ (సి) మదుషంక (బి) ధనంజయ 5; హార్దిక్ (సి) మెండిస్ (బి) మదుషంక 29; హుడా (నాటౌట్) 41; అక్షర్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–46, 4–77, 5–94. బౌలింగ్: రజిత 4–0–47–0, మదుషంక 4–0–35–1, తీక్షణ 4–0–29–1, కరుణరత్నే 3–0–22–1, ధనంజయ 1–0–6–1, హసరంగ 4–0–22–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) మావి 1; మెండిస్ (సి) సామ్సన్ (బి) హర్షల్ 28; ధనంజయ (సి) సామ్సన్ (బి) మావి 8; అసలంక (సి) కిషన్ (బి) ఉమ్రాన్ 12; రాజపక్స (సి) హార్దిక్ (బి) హర్షల్ 10; షనక (సి) చహల్ (బి) ఉమ్రాన్ 45; హసరంగ (సి) హార్దిక్ (బి) మావి 21; కరుణరత్నే (నాటౌట్) 23; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) మావి 1; రజిత (రనౌట్) 5; మదుషంక (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 160. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–47, 4–51, 5–68, 6–108, 7–129, 8–132, 9–159, 10–160. బౌలింగ్: హార్దిక్ 3–0–12–0, శివమ్ మావి 4–0–22–4, ఉమ్రాన్ 4–0–27–2, చహల్ 2–0–26–0, హర్షల్ 4–0–41–2, అక్షర్ 3–0–31–0.
Comments
Please login to add a commentAdd a comment