హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.
బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్
టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే (5 ఓవర్లలో 40/3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి దోహదపడ్డాడు. ఆఖర్లో శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 12, శుభ్‌మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి ఔట్ కాగా.. రింకూ సింగ్ (11), వాషింగ్టన్ సుందర్ (1) అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.
విజృంభించిన ముకేశ్
168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన ఆ జట్టు క్రమ అంతరాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (34) టాప్ స్కోరర్ కాగా.. మరుమణి (27), బ్రియాన్ బెన్నెట్ (10), , ఫరక్ అక్రమ్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.
భారత బౌలర్లలో ముకేశ్‌తో పాటు శివమ్ దూబే (4-0-25-2), తుషార్ దేశ్‌పాండే (3-0-26-1), వాషింగ్టన్ సుందర్ (2-0-7-1), అభిషేక్ శర్మ (3-0-20-1) వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment