
టీమిండియాకు ఏమైంది..? పింక్ బాల్ టెస్టులో ఈరోజు భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూసిన తర్వాత సగటు అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న ఇది. కనీస పోరాట పటిమ కూడా చూపించకుండానే టీమిండియా బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టి అత్యంత చెత్త రికార్డును జట్టు పేరిట లిఖించారు.
అడిలైడ్ : టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగల వద్ద ముగించింది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఈ స్కోరును నమోదు చేసింది.
కాగా మహ్మద్ షమీ గాయంతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో నేడు భారత్ ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 5 వికెట్లు.. పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచారు. (చదవండి : టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1)
Comments
Please login to add a commentAdd a comment