
న్యూఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 11) జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 27.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్ (49) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. శ్రేయస్ అయ్యర్ (28) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
కాగా, ఈ విజయంతో భారత్.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును సమం చేసింది. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు (అన్ని ఫార్మాట్లలో) సాధించిన జట్టుగా టీమిండియా.. ఆస్ట్రేలియా సరసన నిలిచింది. 2003లో ఆసీస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 38 విజయాలు (రికీ పాంటింగ్ సారధ్యంలో 30 వన్డేలు, 8 టెస్ట్‌లు) నమోదు చేయగా.. ఈ ఏడాది భారత్ ఇప్పటికే (ఈ క్యాలెండర్ ఇయర్‌లో భారత్ ఇంకా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది) 38 విజయాలు (56 మ్యాచ్‌ల్లో 23 టీ20లు, 2 టెస్ట్‌లు, 13 వన్డేలు) సాధించి ఆసీస్ రికార్డుకు ఎసరు పెట్టే దిశగా సాగుతుంది.
5 వరుస పరాజయాలతో ఈ క్యాలెండర్ ఇయర్‌ను ప్రారంభించిన భారత్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా వరుస విజయాల బాట పట్టింది. ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై భంగపడ్డా.. ఆతర్వాత వరుసగా వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఇంగ్లండ్, తాజాగా దక్షిణాఫ్రికాపై వరుస విజయాలు సాధించింది. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/18), వాషింగ్టన్ సుందర్ (2/15), షాబాజ్ అహ్మద్ (2/32), సిరాజ్ (2/17) ధాటికి సఫారీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. సఫారీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వీరిలో క్లాసెన్ (34) టాప్ స్కోరర్ కాగా.. జన్నెమాన్ మలాన్ 15, జన్సెన్ 14 పరుగులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment