టీమిండియా హెడ్ కోచ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఓటు హక్కును ఉపయోగించుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. కర్ణాటకలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బెంగళూరులో ఓటు వేశాడు.
ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అత్యంత సాదాగా పోలింగ్‌బూత్‌కు తరలివచ్చిన ద్రవిడ్.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన హక్కును వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా భారత యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు.
‘‘ఇది నా ఓటు. ప్రజాస్వామ్యం నాకు కల్పించిన అవకాశం. కాబట్టి కచ్చితంగా నేను దీనిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పోలీసులు బాగా పనిచేస్తున్నారు.
ఈసారి పోలింగ్ విషయంలో బెంగళూరు రికార్డు సృష్టిస్తుందని భావిస్తున్నా. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తరలిరావాలి. తమ హక్కును ఉపయోగించుకోవాలి. పౌరులను అప్రమత్తం చేయడంలో మీడియా కూడా ఇంకాస్త చొరవ తీసుకోవాలి’’ అని ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు.
కాగా వరుస షెడ్యూళ్లతో బిజీగా ఉండే రాహుల్ ద్రవిడ్‌కు ప్రస్తుతం విరామం దొరికింది. ఐపీఎల్-2024 నేపథ్యంలో ఆటగాళ్లంతా క్యాష్ రిచ్ లీగ్లో భాగమైన వేళ.. ద్రవిడ్ కుటుంబానికి సమయం కేటాయించాడు.
అయితే, జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అయితే, మే 1 లోగా జట్ల వివరాలను సమర్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి గడువు విధించిన వేళ టీమిండియా ఎంపిక గురించి రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే పలుమార్లు చీఫ్ సెలక్టర్‌తో భేటీ అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment